ఎంపీలో రెండు సీట్లకు మినహా మొత్తం అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం పట్టుదలగా ఉన్న బీజేపీ శనివారంనాడు 92 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన అభ్యర్థులతో కలిసి మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను 228 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. 
 
మరో ఇద్దరి పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈసారి జాబితాలో మాజీ మంత్రి మాయాసింగ్‌కు గ్వాలియర్ ఈస్ట్ సీటు కేటాయించారు. మంత్రి ఉషా ఠాకూర్‌ను అంబేద్కర్ గనర్-మహూ నుంచి టిక్కెట్ లభించింది.  శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్‌లో ఇటీవలనే చేర్చుకున్న మౌసమ్ బైసన్‌ను బైసన్ టిక్కెట్ కేటాయించారు. 
 
టిక్కెట్లు దక్కిన మహిళా అభ్యర్థుల్లో ఉమా ఖటిక్ (హట్టా ఎస్‌సీ), ప్రతిమా బగ్రి (రాయగావ్ ఎస్‌సీ), రాధాసింగ్ (ఛత్రంగి ఎస్‌సీ) తదితరులు ఉన్నారు. 2018లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన ప్రదీప్ జైశ్వాల్‌కు బీజేపీ టిక్కెట్టిచ్చింది. ఆసక్తికరంగా, ఈసారి సుమారు 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.
 
పాతముఖాలకే పెద్దపీట వేసింది. బీజేపీ సీనియర్ నేత కైలాస్ విజయవర్గీయ కుమారుడు ఆకాష్‌కు టిక్కెట్ నిరాకరించింది. ఇండోర్-3 నుంచి రాకేష్ శుక్లాకు టిక్కెట్ ఇచ్చారు. నరేంద్ర సింగ్ కుష్వాహ భిండ్ నుంచి, నారాయణ్ సింగ్ కుష్వాహ గ్వాలియర్ సౌత్ నుంచి, రాకేష్ గిరి తికమ్‌గఢ్ నుంచి పోటీ చేస్తారు. 
 
 ప్రహ్లాద్ లోధికి పోవై నుంచి, అభిలాష్ పాండేకు జబల్‌పూర్ నార్త్, ఎమ్మెల్యే సులోచనా రావత్ కుమారుడు విశాల్ రావత్‌కు జోబట్ నుంచి టిక్కెట్ ఇచ్చింది. కాగా,  మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం ఉదయం విడుదల కావడంతో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైందని చీఫ్ ఎన్నికల కార్యాలయం ప్రకటించింది.
 
నామినేషన్ల స్క్రూటినీ ఈనెల 31న జరుగుతుంది. బీజేపీ పాలనలో ఉన్న ఈ రాష్ట్రంలో నవంబర్ 17న మొత్తం 230 నియోజక వర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 230 నియోజక వర్గాలకు కాంగ్రెస్ 229 మంది అభ్యర్థులను ప్రకటించగా, పాలకవర్గం బీజేపీ ఇంతవరకు 228 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రంగంలో ఉన్నాయి. .
 
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 109 సీట్లు సాధించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగా, జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేసి తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 127 మంది సభ్యుల బలం ఉంది.
ఝల్రాపటన్‌ నుంచి తిరిగి వసుంధర పోటీ
కాగా, రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరా రాజే తన కంచుకోట ఝల్రాపటన్‌ నుంచి మరోసారి ఎన్నికల బరిలో దిగినున్నారు. శనివారం బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో 10 మంది మహిళా అభ్యర్థులు సహా 83 పేర్లను వెల్లడించింది. 50మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చింది. 9 మందికి నిరాకరించింది. 
 
మొదటి జాబితాలో పక్కనపెట్టిన మాజీ ఉప రాష్ట్రపతి భైరాన్‌సింగ్‌ షెకావత్‌ అల్లుడు, ఐదుసార్లు ఎమ్మెల్యే నర్పత్‌సింగ్‌ రజ్వీకీ ఈసారి టికెట్‌ దక్కింది. రజ్వీ ప్రస్తుతం విద్యాధర్‌నగర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈసారి ఛిత్తోర్‌గఢ్‌ టికెట్‌ ఇచ్చింది. శాసనసభా పక్షనేత, ఏడుసార్లు ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్‌ను చురు నుంచి కాకుండా తారానగర్‌ నుంచి బీజేపీ బరిలో దింపింది. 
 
కాగా 41 మందితో ప్రకటించిన తొలి జాబితాలో బీజేపీ అధిష్ఠానం ఏకంగా ఏడుగురు ఎంపీలకు అసెంబ్లీ టికెట్లిచ్చి ఆశ్చర్యపరిచింది. తాజా జాబితాలో పార్లమెంటు సభ్యులెవరినీ శాసనసభ బరిలో దించలేదు. 200సీట్లున్న రాజస్థాన్‌లో నవంబరు25న పోలింగ్‌ జరగనుంది.