ఈ నెల 7న హమస్ ఉగ్ర దాడి, ఆ తరువాత ఇజ్రాయిల్ ఎదురు దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 21 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్ (సిపిజె) తెలిపింది. మరణించిన జర్నలిస్టుల్లో 18 మంది పాలస్తీనియున్లు, ముగ్గురు ఇజ్రాయిలీలు, ఒక లెబనాన్‌కు చెందిన జర్నలిస్టు ఉన్నారు.
ఈ యుద్ధంలో మరో ఎనిమింది జర్నలిస్టులు గాయపడ్డారని తెలిపింది. మరో ముగ్గురు గల్లంతు కావడం లేదా నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొంది. మరణించిన 21 మంది జర్నలిస్టుల పేర్లు, వారి వృత్తి పరమైన వివరాలను కూడా సిపిజె ఓ ప్రకటనలో ప్రచురించింది.
‘హృదయ విదారక యుద్ధాన్ని కవర్ చేయడానికి ఈ ప్రాంతంలో జర్నలిస్టులు గొప్ప త్యాగాలు చేస్తున్నారు. అన్ని దేశాలు వారి భద్రతను కాపాడడానికి చర్యలు తీసుకోవాలి’ అని సిపిజె కోరింది. ఈ యుద్ధంలో మరణించిన, గాయపడిన, నిర్భంధించబడిన జర్నలిస్టులకు చెందిన అన్ని వార్తలపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది.
ఈ యుద్ధంలో ఇప్పటివరకు నాలుగు వేల మంది కంటే ఎక్కువ మంది మరణించినట్లు భావిస్తున్నారు. మృతుల్లో అత్యధికులు పాలస్తీనీయులే. కాగా, ఇజ్రాయిల్ దిగ్బంధనంతో ఇబ్బందులు పడుతున్న గాజా ప్రజలకు సాయం అందేందుకు వీలుగా సహాయ ట్రక్కులను అనుమతించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం ఆయన రాఫా సరిహద్దు క్రాసింగ్‌ను సందర్శించారు. పాలస్తీనియన్లు కూడా అందబోయే సాయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లెబనాన్‌తో గల సరిహద్దులో హిజ్బులా తీవ్రవాదులతో రోజుల తరబడి ఘర్షణలు కొనసాగించిన అనంతరం ఉత్తర ప్రాంత కిర్యాత్ షామోనా నగరాన్ని ఖాళీ చేయనున్నట్లు శుక్రవారం ఇజ్రాయిల్ అధికారులు ప్రకటించారు.
మరో వైపు ఈజిప్టు నుంచి సహాయ సామాగ్రి ప్రస్తుతం రాఫా బోర్డర్ వరకు చేరుకున్నది. గాజాకు సరకుల్ని పంపేందుకు రాఫా క్రాసింగ్ వద్ద ట్రక్కుల్ని నిలిపారు. ఐక్యరాజ్యసమితికి చెందిన వాహనాలు అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
More Stories
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా