ఏడు దేశాలకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతికి అనుమతి

బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించింది. దేశంలో నాన్‌ బాస్మతి తెల్ల బియ్యం కొరతను నివారించేందుకు, ఆ బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం గత జూలైలో వాటి ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. 
 
అయితే, నేపాల్, మలేషియా, ఫిలిప్పీన్స్, సీషెల్స్ , కామెరూన్, ఐవొరీ కోస్ట్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని వివిధ పరిణామాలతో ఎగుమతి చేయడానికి తాజాగా కేంద్రం అనుమతించింది.  నేషనల్‌ కోపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌, ది డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ల ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్రం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
 
ఏడు దేశాలకు 10,34,800 టన్నుల నాన్‌ బాస్మతి రకం తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం సమ్మతించింది. నేపాల్‌కు 95,000 టన్నులు, కామెరూన్‌కు 1,90,000 టన్నులు, ఐవొరీ కోస్ట్‌కు 1,42,000 టన్నులు, రిపబ్లిక్‌ ఆఫ్‌ గినియాకు 1,42,000 టన్నులు, మలేషియాకు 1,70,000 టన్నులు, ఫిలిప్పీన్స్‌కు 2,95,000 టన్నులు, సీషెల్స్‌కు 800 టన్నుల తెల్లబియ్యం ఎగుమతులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 
 
కాగా, అంతకుముందు యూఏఈ, సింగపూర్‌ దేశాలకు కూడా బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించిన విషయం తెలిసిందే. గతవారం కేంద్ర ప్రభుత్వం పారాబాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎగుమతి సుంకాన్ని మార్చి 31, 2024 వరకు పొడిగించింది. 
 
పొట్టుతో పాక్షికంగా ఉడకబెట్టిన బియ్యాన్ని పారాబాయిల్డ్ రైస్ అంటారు. 2022 సెప్టెంబరులో భారత్ బ్రోకెన్ రైస్ ఎగుమతులను నిషేధించింది. వరి పంట కింద విస్తీర్ణం తగ్గడం వల్ల తక్కువ ఉత్పత్తి గురించి ఆందోళనల మధ్య పారాబాయిల్డ్ రైస్ మినహా బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. ఆ తర్వాత నవంబర్‌లో నిషేధాన్ని ఎత్తివేసింది. 
 
చక్కెర ఎగుమతులపై ఆంక్షలు పొడిగింపు
 
కాగా, చక్కెర ఎగుమతులపై విధించిన ఆంక్షలను అక్టోబర్ 31వ తర్వాత కూడా పొడిగిస్తూ భారతదేశం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బుధవారంనాడు ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. రా షుగర్, వైట్ షుగర్, రిఫైన్డ్ షుగర్, ఆర్గానిక్ షుగర్‌ల ఎగుమతులపై ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయితే, గత ఏడాది ప్రకటించిన కన్షిషన్, టీఆర్‌క్యూ కోటా కింద ఈయూ, యూఎస్‌లకు ఈ ఆంక్షలు వర్తించవని తెలిపింది.