గాజా ఆస్పత్రిపై దాడి పట్ల ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ ఆసుపత్రిపై జరిపిన వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ దాడి ఐడిఎఫ్‌ (ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌) చేసిందని హమాస్‌ ఆరోపించింది. అయితే ఈ దాడి ఐడిఎఫ్‌ పాల్పడలేదని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజిమన్‌ నెతన్యాహు వెల్లడించారు.  ఈ నేపథ్యంలో ఈ దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
 ‘అల్‌ అహ్లీ ఆసుపత్రిలో జరిగిన ప్రాణ నష్టానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తాను. ఈ ఘర్షణల్లో పౌరుల మరణాలు ఆందోళన కలిగిస్తుంది. ఈ దాడికి ప్రమేయం ఉన్నవారు బాధ్యత వహించాలి.’ అని మోదీ తన ఎక్స్‌లో పోస్టు చేశారు.
 
కాగా, ఈ ఘటనలో మృతి చెందిన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన సంతాపం తెలిపారు. అలాగే ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ కూడా ఆసుపత్రిపై దాడిని ఖండించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఐడిఎఫ్‌ కానీ, పాలస్తీనా హమాస్‌ కానీ ఎవరైనా సరే పౌరులపై జరిపి ఈ దాడిని సమర్థించలేమని మాక్రాన్‌ స్పష్టం చేశారు.
 
ఇజ్రాయెల్‌ వైమానిక దాడులే ఈ దుర్ఘటనకు కారణమని హమాస్‌ ఆరోపించడాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఖండించారు. ”ఈ విషయాన్ని యావత్‌ ప్రపంచం తెలుసుకోవాలి. గాజాలోని అనాగరిక ఉగ్రమూకలే.. అక్కడి ఆసుపత్రిపై దాడి చేశాయి. ఐడీఎఫ్‌ (ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌) కాదు. మా పిల్లలను అతి దారుణంగా హత్య చేసిన ఆ ఉగ్రవాదులు.. ఇప్పుడు వారి పిల్లలను కూడా చంపేస్తున్నారు ” అని నెతన్యాహు ఆరోపించారు. 
 
అటు ‘ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌’ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఆసుపత్రి సమీపంలో పీఐజే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్‌ గురితప్పి ఆసుపత్రిలో పేలుడు సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు ఐడీఎఫ్‌ అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో ఓ వీడియో, కొన్ని పోస్టులు చేసింది.
 
ఈ మేరకు ప్రమాదానికి ముందు.. ఆ తర్వాత ఆసుపత్రి ఆవరణకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ‘ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థ విఫలమైన రాకెట్ ప్రయోగం గాజా నగరంలోని అల్ అహ్లీ ఆసుపత్రిని తాకింది. ఈ రాకెట్ ప్రయోగానికి ముందు ఆ తరువాత ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతం’ అని ఐడీఎఫ్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.
 

మరోవైపు, గాజా ఆస్పత్రిపై దాడి కారణంగా బైడెన్‌ జోర్డాన్‌ పర్యటన రద్దైంది. ఇజ్రాయెల్‌ పర్యటన తర్వాత బైడెన్‌ జోర్డాన్‌ వెళ్లాల్సి ఉంది. అక్కడ అరబ్‌ నేతలతో సమావేశం నిర్వహించేలా ముందుగా ప్రణాళిక చేసుకున్నారు. జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 2, ఈజిప్టు ప్రధాని ఎల్‌-సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్‌ముద్‌ అబ్బాస్‌ తదితరులతో భేటీ కావాల్సి ఉంది.

అయితే, మంగళవారం గాజా ఆసుపత్రిపై దాడి ఘటనతో అనూహ్యంగా బైడెన్‌ జోర్డాన్‌ పర్యటన రద్దైంది. బైడెన్‌ జోర్డాన్‌ పర్యటన రద్దైనట్లు జోర్డాన్‌ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది తెలిపారు. అయితే ఇందుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా ఇజ్రాయెల్‌ లో ఈ వారం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధృవీకరించలేదు. కాగా, గత వారం ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించేందుకు బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ ఆ దేశంలో పర్యటించారు.