నాడు ఓటుకు నోటు, నేడు సీటుకు నోటు.. రేవంత్ పై కాంగ్రెస్ లో కల్లోలం

కర్ణాటకలో అధికారం చేచిక్కగానే, పొరుగునే ఉన్న తెలంగాణలో కూడా తమదే అధికారం అంటూ నిన్నటివరకూ సంబరాలలో గడిపిన కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎన్నికలకు 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయగానే పరిస్థితి తిరగబడినట్లు కనిపిస్తున్నది.  పలువురు ఆశావహులు టికెట్లు రాకపోవడంతో తిరుగుబాటు చేస్తున్నారు.  రాజీనామాల బాటపడ్డారు. 
 
మరికొందరు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తూ, బహిరంగంగా నిరసనలకు దిగుతున్నారు. టికెట్‌ ఆశించి భంగపడిన ఆశావహులు గాంధీ భవన్‌లో నిరసనను, ధర్నాలను కొనసాగిస్తున్నారు. అసంతృప్త నేతలు ఏకంగా గాంధీభవన్‌లో టెంట్లు వేసి ధర్నాలు చేస్తున్నారు. 
 
ముఖ్యంగా పాతబస్తీకి చెందిన పలు నియోజకవర్గాల, గద్వాల, మేడ్చల్‌ కార్యకర్తలు గాంధీభవన్‌లోనే మకాం వేశారు. తమ నేతకు న్యాయం జరిగే వరకు గాంధీభవన్‌ను వీడేది లేదని తేల్చి చెప్తున్నారు. పీసీసీ చీఫ్‌ ‘రేవంత్‌రెడ్డి కాదు.. రేటెంతరెడ్డి’ అంటూ గాంధీభవన్‌ మెట్లపై రేవంత్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు.
 
 తాజాగా టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి 60 సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని, గద్వాల టికెట్‌ను రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమికి అమ్ముకున్నారని విమర్శించారు.  ఉద్యమకారులకు, ఎన్నో ఏళ్లుగా పార్టీలో కష్టపడ్డవాళ్లకు టికెట్ ఇవ్వకుండా పారాచూట్ నాయకులకు టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
నాడు ఓటుకు నోటు… నేడు సీటుకు నోటు అంటూ గన్‌పార్క్ దగ్గర విజయ్ కుమార్ ఆందోళన చేశారు.  తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని మండిపడుతున్నారు.  ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే సీట్లు కేటాయించారని మండిపడ్డారు. 
 
రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోందని పేర్కొంటూ వెంటనే రేవంత్‌ రెడ్డిని టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తొలి జాబితాలో మార్పులు చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని విజయ్ కుమార్ ప్రకటించారు.

రేవంత్‌ తీరుతో రెండు రోజులుగా గాంధీభవన్‌కు తాళం పడిందని, పారాచూట్‌ నేతలకు టికెట్లు అమ్ముకున్నారని పీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్‌రావు విమర్శించారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలోని తన ఫాంహౌస్‌లో కాంగ్రెస్‌ ఆశావహులు, పార్టీనేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 

ఈ సమావేశానికి చింతలపల్లితోపాటు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి హాజరై కొల్లాపూర్‌లో పార్టీని నమ్ముకొని ఉన్న జగదీశ్వర్‌రావుకు ఎందుకు టికెట్‌ కేటాయించలేదో రేవంత్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మేడ్చల్ కాంగ్రెస్ టికెట్ హరివర్ధన్ రెడ్డికి ఇవ్వలేదని గాంధీ భవన్ ముందు ఆయన అనుచరులు ధర్నాకు దిగారు. కాగా, మాజీ ఎంపీ మధు యాష్కీ నివాసంలో మాజీ ఎంపీలు బలరాం నాయక్, రాజయ్య, సురేష్ షెట్కార్ భేటీ అయ్యారు. ఉద్యమంలో పనిచేసిన తమకు సీట్లు మొదటి లిస్టులో ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొదటి లిస్టులో నేతలు ఆశిస్తున్న సీట్లు లేకపోవడంపై అసంతృప్తి ఉన్నారని సమాచారం. ఇటీవలె బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జిట్టా బాలకృష్ణ రెడ్డి  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి రాకపోవడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీఆర్ఎస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.