వ్యాపారికి లోక్‌సభ వెబ్‌సైట్ లాగిన్ ఇచ్చిన టిఎంసి ఎంపీ

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాపై బిజెపి ఎంపి నిశికాంత్ దూబే తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. లోక్‌సభ వెబ్‌సైట్ సమాచారం పొందేందుకు టిఎంసి ఎంపి ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందనికి లాగిన్ వీలు కల్పించిందని పేర్కొంటూ నిశికాంత్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.  సంబంధిత విషయంపై కేంద్ర ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ కు, సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు లేఖలు రాశారు.

బిజినెస్‌మెన్ వ్యాపార ప్రయోజనాలకు వాడుకునేందుక టిఎంసి ఎంపి లంచాలు తీసుకుని లోక్‌సభ వెబ్‌సైట్‌ను లీక్ చేసిందని ఈ లేఖలలో ఆరోపించారు. బిజెపి ఎంపి వీటిన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు జరిపించాల్సి ఉందని ఐటి మంత్రిత్వశాఖకు లేఖలో తెలిపారు. సంబంధిత విషయంలో తనకు సుప్రీంకోర్టు లాయరు ఒకరి ద్వారా పూర్తి సాక్షాధారాల సమాచారం అందిందని బిజెపి ఎంపీ వెల్లడించారు.

ఇప్పటి వ్యవహారం 2005 నాటి క్యాష్ ఫర్ క్వెరీ స్కాండల్‌ను తలపించిందని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు లోక్‌సభ స్పీకర్ ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని కూడా బిజెపి ఎంపి డిమాండ్ చేశారు.  ఐటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని దర్యాప్తు జరిపితే పార్లమెంట్ సభ్యురాలి ద్వారా లోక్‌సభ వెబ్‌సైట్ ఇతరులకు లాగిన్ అయిందీ లేనిదీ తెలిసిపోతుందని, దీని ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉందని నిశికాంత్ దూబే తెలిపారు. కాగా, ఈ మహిళా ఎంపిపై ఇప్పటికే ప్రశ్నలకు ముడుపుల ఆరోపణలు చేశారు.

అంతకు ముందు స్పీకర్ ఓం బిర్లాకు  చేసిన ఫిర్యాదులో లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు ఓ వ్యాపారి నుండి ఆ మహిళా ఎంపీ ముడుపులు స్వీకరించారని ఆరోపించారు. వ్యాపారవేత్త దర్శన్ హిరానందని, వారి కంపెనీ ప్రయోజనాలు కాపాడటం కోసం పలు ప్రశ్నలు అడిగారని తెలిపారు.  ఆమె ఇటీవల అడిగిన 61 ప్రశ్నలలో 50 ప్రశ్నలు ఈ కంపనీ ప్రయోజనాలకోసం మరో కంపెనీ అదానీని లక్ష్యంగా చేసుకొని అడిగినవే అని దూబే  స్పష్టం చేశారు.

ఆ వ్యాపారవేత్త ఆ ఎంపీకి రూ 2 కోట్ల నగదుతో పాటు ఐ ఫోన్ వంటి ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఆమెకు రూ 75 లక్షలు ఇచ్చారని చెప్పారు. తాను చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి, ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి ఎంపీ కోరారు. పార్లమెంట్ లో ప్రశ్నలు వేసేందుకు ముడుపులు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలు నిజమైతే దిగ్భ్రాంతికరం, సిగ్గుచేటు అని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

కాగా, ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ అందరు ఎంపీల లాగిన్ లను లొకేషన్ లతో సహా ఏ విధంగా ఉపయోగిస్తుంటారో వివరాలు వెల్లడించాలని ఐటి మంత్రిని  టిఎంసి ఎంపీ మహువా మెయిత్రా కోరారు. పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి అనేకమంది సహాయకుల సేవలను ఉపయోగించుకోవలసి ఉంటుందని, అందుకోసం లాగిన్ ఉపయోగిస్తుండటం సర్వసాధారణమే అంటూ ఆమె సమర్ధించుకు వచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాలలో ఎక్కువగా పిఎలు, సహాయకులతో సహా చాలామంది సేవలను ఉపయోగించుకోవలసి వస్తుందని ఆమె గుర్తు చేశారు.