బీఆర్‌ఐ సదస్సుకు చైనా చేరుకున్న రష్యా అధినేత పుతిన్‌

చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ పథకం ప్రారంభించి నేటికి పదేండ్లు పూర్తవుతున్నది. దీనిని పురస్కరించుకుని బీజింగ్‌లో భారీస్థాయిలో అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సును డ్రాగన్‌ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చైనాలో పర్యటిస్తున్నారు.

మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయనకు చైనా మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు.  బీజింగ్‌ తన ప్రపంచ ప్రభావాన్ని విస్తరించడానికి ఉపయోగిస్తున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ అనే ప్రతిష్టాత్మక మైలురాయి ప్రాజెక్ట్‌ ఫోరమ్‌ కోసం చైనా ఈ వారం 130 దేశాల ప్రతినిధులను స్వాగతించింది. 

పుతిన్‌ బుధవారం చర్చల కోసం జిన్‌పింగ్‌ను కలవబోతున్నారు. ఈ చర్చలలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. కాగా, ఇరు దేశాల అధినేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి భారత్‌ దూరంగా ఉండాలని నిర్ణయించింది. 

2017, 2019లో కూడా బీఆర్‌ఐ సదస్సుకు ఇండియా దూరంగా ఉన్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా 6 వేల కోట్ల డాలర్ల వ్యయంతో చేపట్టిన చైనా- పాక్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపెక్‌) ప్రాజెక్టు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా సాగడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే దీనికి కారణం.

 కాగా, యుద్ధ నేరాల కేసులో పుతిన్‌ను అంతర్జాతీయ కోర్టు దోషిగా నిర్ధారించింది. రష్యా అధినేత అరెస్టుకు గత మార్చిలో ఆదేశాలు జారీ చేసింది.  దీంతో పుతిన్‌ గత కొన్ని రోజులు విదేశీ పర్యటనలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. గత నెలలో భారత్‌ వేదికగా జరిగిన జీ20 సమావేశాలకు కూడా హాజరుకాలేదు.