గాజా దవాఖానపై దాడి 500 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది. సెంట్రల్‌ గాజాలోని ఓ దవాఖానపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో కనీసం 500 మంది వరకు మృతిచెందినట్టు హమాస్‌ మంగళవారం వెల్లడించింది.  అయితే ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) వర్గాలు దీన్ని ఖండించాయి. ఆస్పత్రిలో దాచిన మందుగుండు వల్ల నష్టం జరిగి ఉంటుందని పేర్కొన్నాయి.

సెంట్రల్‌ గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో హమాస్ టాప్‌ కమాండర్లలో ఒకరైన ఆయ్మన్ నొఫాల్ మృతి చెందిన్నట్లు హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్ ధ్రువీకరించింది. ఇప్పటి వరకు మరణించిన హమాస్ మిలిటెంట్లలో ఆయ్మన్ నొఫాల్ కీలకమైన హమాస్ కమాండర్ కావడం గమనార్హం.  మరోవైపు ఇజ్రాయెల్‌ సైన్యం ఆదేశాలతో లక్షలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి దక్షిణ ప్రాంతానికి వెళ్లిపోతున్నారు.

వేలాది మంది గాజా నుంచి బయటపడేందుకు ఈజిప్టుతో సరిహద్దు పంచుకొనే రఫా పట్టణానికి చేరుకొంటున్నారు. ఈ క్రమంలో పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న ఖాన్‌ యూనిస్‌, రఫాలపై కూడా ఇజ్రాయెల్‌ భారీగా బాంబుదాడులకు పాల్పడిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తున్నది. 

హమాస్‌ స్థావరాల, సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్‌, లెబనాన్‌ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. లెబనాన్‌ భూభాగం నుంచి ప్రయోగించించిన యాంటీ ట్యాంక్‌ క్షిపణి ఇజ్రాయెల్‌లోని సరిహద్దు పట్టణం మెటులాలో పడింది.  హెజ్బొల్లా గ్రూపు దీన్ని ప్రయోగించి ఉంటుందని ఇజ్రాయెల్‌ వర్గాలు పేర్కొన్నారు.

ప్రతిగా ఇజ్రాయెల్‌ సైన్యం దక్షిణ లెబనాన్‌ సరిహద్దు ప్రాంతాలపై ఆర్టిలరీ షెల్లింగ్‌, ఫాస్పరస్‌ దాడులు చేసిందని లెబనాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ నివేదించింది. ఇప్పటి వరకు గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన వైమానిక దాడుల కారణంగా 2800 మంది ప్రాణాలు కోల్పోగా.. 10వేల మందికిపైగా గాయపడ్డారు. హమాస్‌ వైపు రాకెట్లను ఇజ్రాయెల్‌ వైపు ప్రయోగిస్తుండడంతో.. ఇజ్రాయెల్‌ సైతం వైమానిక దాడులు కొనసాగిస్తున్నది.

నేడు అరబ్‌ నేతలతో బైడెన్‌ భేటీ

హమాస్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బుధవారం ఆ దేశంలో పర్యటిస్తారని యూఎస్‌ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ప్రకటించారు. ఇజ్రాయెల్‌ పర్యటన తర్వాత బైడెన్‌ జోర్డాన్‌ వెళ్లాడని, అక్కడ అరబ్‌ నేతలతో సమావేశం అవుతారని వైట్‌హౌస్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బి వెల్లడించారు.

మరోవైపు ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా తన బలగాలకు కీలక ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తున్నది. యుద్ధంపై స్పందించేందుకు మోహరింపునకు సిద్ధంగా ఉండాలంటూ రక్షణ శాఖ దాదాపు 2 వేల మంది సైనికులకు ఆదేశాలు ఇచ్చినట్టు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి.