అవినీతికి పాల్పడే వారెవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని, త్వరలోనే తెలంగాణలో ఉన్న వారి వంతు కూడా వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఉద్దేశించి జ్యోతి స్పష్ష్టం చేశారు. ముషీరాబాద్, అంబర్‌పేటలో మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ముఖ్య అతిథిగా సాధ్వి నిరంజన్ జ్యోతి పాల్గొంటూ 2014కు ముందు దేశం అవినీతి, కుంభకోణాలతో సతమతమైందని, ప్రపంచంలో భారతదేశానికి సరైన గుర్తింపు దక్కేది కాదని గుర్తు చేశారు.
అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సాధ్వి నిరంజన్ జ్యోతి చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసును స్పష్టంగా ప్రస్తావించిన ఆమె లిక్కర్ కుంభకోణం ఇక్కడ తెలంగాణలో జరిగినట్లు తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు. దేశం లో ఎవ్వరూ అవినీతికి పాల్పడినా వారెంత పెద్ద వారైన తప్పకుండా జైలుకు వెళ్లాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు.
చట్టం తన పని తాను చేసుకుంటోందని, అవినీతిపరులు జైలుకు వెళ్లాల్సి వస్తోందని ఆమె హెచ్చరించారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ అరెస్టులపై ఆమె మాట్లాడుతూ. ఇద్దరు మాజీ మంత్రులు జైలుకు వెళ్లారని, తాజాగా దిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరో నేత కూడా జైలుకు వెళ్లారని ఆమె గుర్తు చేశారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో కవిత పేరును ఆమె ప్రస్తావిస్తూ మరికొన్ని రోజుల్లో తెలంగాణలో ఉన్న వారి వంతు కూడా వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పరోక్షంగా హెచ్చరించారు. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే నాయకుడు కావాలా? లేదా దేశాన్ని దోచుకునే వారు కావాలా? అని సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రశ్నించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తన కూతురిని సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇతర నాయకులకు అర్హత లేనట్లుగా పదవులన్నీ కేవలం కల్వకుంట్ల కుటుంబానికే దక్కుతున్నాయని ఆమె ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అవి కేసీఆర్ కు పడినట్లేనని ఆమె విమర్శించారు.
తెలంగాణ లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతూ బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్ష కూటమి “ఇండియా” పై సాధ్వి నిరంజన్ జ్యోతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షల కూటిమి ” ఇండియా ” కాదని అది “పరివార్ వాడీల” (రాజవంశాల) కూటమి అని ఆమె ఆరోపించారు.
యూపీఏ పేరు వింటే కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కామ్ లు అన్నీ ప్రజలకు గుర్తొస్తాయని ప్రతిపక్ష కూటమి పేరును కాంగ్రెస్ పార్టీ ” ఇండియా” అని పెట్టిందని ఆమె ధ్వజమెత్తారు. “సమాజ్‌వాదీ, మమతా బెనర్జీ , శరద్ పవార్ , లాలూ వీరంతా “పరివార్వాడీలు” (రాజవంశాలు) కాదా? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ ఒక్క కుటుంబంతో నడిచే పార్టీ కాదని, దేశమంతా బీజేపీ కుటుంబమే ఆమె తెలిపారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ ప్రభుత్వం రద్దు చేయడంపై ఆమె మాట్లాడుతూ ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
ఇళ్ల నిర్మాణం, ఎల్‌పీజీ కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, పీఎం-కిసాన్ పథకం కింద రైతు లబ్ధిదారులకు నిధుల బదిలీ తో సహా మోదీ ప్రభుత్వంలో అమలు చేస్తున్న అనేక పథకాలను సాధ్వి నిరంజన్ జ్యోతి హైలైట్ చేశారు. తెలంగాణ లో ” డబుల్ ఇంజన్ ప్రభుత్వం ” అవసరమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.
More Stories
ప్రజాస్వామ్యానికి మూల స్తంభం మీడియా
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దోషికి జీవిత ఖైదు
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా