అదాని గ్రూపుకు చెందిన రెండు ఎయిర్‌పోర్టుల ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (ఎంఐఎఎల్), నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (ఎన్‌ఎంఐఎఎల్)ల ఆర్థిక లావాదేవీలను, ఇతర ముఖ్యమైన పత్రాలను అందచేయాలని కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదాని గ్రూపు సంస్థలను ఆదేశించింది.
ఈ విషయాన్ని ఆ గ్రూపునకు చెందిన అదాని ఎంటర్ ప్రైజెస్ స్వయంగా ధృవీకిరించింది. ఈ మేరకు దేశంలోని పలు స్టాక్ ఎక్సేంజ్‌లకు ఆ సంస్థ రాసిన లేఖ శనివారం వెలుగులోకి వచ్చింది. 2017-18 నుండి 2021-22 ఆర్థిర సంవత్సరాల వరకు ఉన్న పూర్తి స్థాయి సమాచారాన్ని అందచేయాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్టు ఈ లేఖలో అదాని సంస్థ తెలియచేసింది.
కార్పొరేట్ మంత్రిత్వశాఖ, హైదరాబాద్ విభాగం నుండి తమకు ఆదేశాలు అందినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హిండెన్‌బర్గ్ నివేదికలో అదాని గ్రూపు అక్రమాలను వివరంగా పేర్కొన్న అనంతర పరిణామాల్లో భాగంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను చేపట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదాని గ్రూపు ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏడు ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వీటిలో ఆరింటిని కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా 2019లో అదాని గ్రూపు సొంతం చేసుకుంది. లక్నో, మంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, గౌహతి, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులు ఈ జాబితాలో ఉన్నాయి. నవీ ముంబాయి ఎయిర్‌పోర్టును ఆ సంస్థ నిర్మిస్తోంది. భారతదేశంలోని విమాన ప్రయాణీకుల్లో 25 శాతం మంది ఈ ఎయిర్‌పోర్టుల గుండా ప్రయాణం చేస్తారని అంచనా!
More Stories
నిషేధానికి ముందే అమెరికాలో టిక్ టాక్ నిలిపివేత
కరోనా తర్వాత కంగనాకు అతిపెద్ద ఓపెనింగ్ ‘ఎమర్జెన్సీ’
బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయం పన్ను బిల్లు