ఎన్‌సీపీ ఎంపీ జైన్ ఆస్తులు రూ 315 కోట్లు జప్తు

ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్నమాజీ  ఎంపీ ఈశ్వర్‌లాల్ శంకర్‌లాల్ జైన్ లాల్వానికి చెందిన ఆస్తులను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ) జప్తు చేసింది. విండ్‌మిల్స్, బంగారం, వజ్ర, వెండి ఆభరణాలు వంటి 70 స్థిర, చరాస్తులను సీజ్ చేసింది.  వీటితోపాటు ముంబై, జల్‌గావ్, థానే, కచ్ వంటి ప్రాంతాల్లోని స్థిరాస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకొంది. 

ఆయన రాజ్‌మల్ లాల్‌చంద్ జ్యువెల్లర్స్, ఆర్‌ఎల్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెండ్, మన్‌రాజ్ జ్యువెల్లర్స్ సంస్థలకు ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనపై బ్యాంక్ ఫ్రాడ్, మనీలాండరింగ్ వంటి అభియోగాలున్నాయి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉద్దేశ పూర్వకంగా రూ. 352 . 49 కోట్ల నష్టం వాటిల్లేట్టు చేశారన్నది ఈశ్వర్‌లాల్‌పై ఉన్న ఆరోపణలు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం కేసులో సీబీఐ మూడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. కంపెనీల ప్రమోటర్లు తప్పుడు పత్రాలు ఇవ్వడంతో పాటు ఆర్థిక వివరాలను పెంచి చూపేందుకు రౌండ్‌ ట్రిప్‌ లావాదేవీలు జరుపడం, ఆడిటర్లతో కుమ్మక్కు కావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.352 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. 

ఈ మేరకు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది నకిలీ పత్రాలతో రుణాలు తీసుకొని తారుమారు చేశారని ఈడీ ఆరోపిస్తున్నది. నిందితులు రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల్లో సైతం అక్రమంగా పెట్టుబడులు పెట్టారంటూ ఆగస్టులో ఈడీ దాడులు నిర్వహించింది..

 “ఈ కంపెనీల ప్రమోటర్లు రుణాల కోసం తప్పుడు వివరాలు ఇవ్వడం, ఆర్థిక వివరాలు పెంచి చూపడానికి రౌండ్‌ట్రిప్ లావాదేవీలు చేయడం, ఆడిటర్లతో కుమ్మక్కవడం వంటివి చేశారు ” అని ఈడీ పేర్కొంది.