ఆలయ ప్రతిష్ఠ రోజున వీఐపీలు ఎవరూ అయోధ్యకు రావద్దు

అయోధ్యలోని భవ్యమైన రామమందిర నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండగా వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఆలయ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. జనవరి 22న మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆరోజు వీఐపీలు ఎవరూ అయోధ్యకు రావద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరింది. 
 
గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు సహా ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కావద్దని విజ్ఞప్తి చేసింది. ప్రతిష్ఠ మహోత్సవంలో కావడం వల్ల వీఐపీలకు తగిన ఏర్పాట్లు చేయలేమని, అందుకు వారు రావద్దని కోరుతున్నామని వివరించింది.  స్థానిక అధికార యంత్రాంగం కూడా ప్రొటోకాల్‌ పాటించే పరిస్థితిలేదని, అందుకే వీఐపీలు ఆరోజున తమ అయోధ్య పర్యటనను వాయిదా వేసుకోవాలని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ కోరారు.
 
జనవరి 26 తర్వాత దేశంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులను అయోధ్యకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 22 వరకూ వారంతా రామ్‌లాలాకు పూజలు చేసుకోవచ్చని వివరించారు. 

‘రాజ్యాంగబద్దమైన ప్రోటోకాల్ కలిగిన ఎవరైనా ప్రాణ ప్రతిష్ఠ రోజును అయోధ్యకు రావద్దు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, విదేశీ రాయబారులు రాజ్యాంగ ప్రోటోకాల్ ఉన్నవారు ఎవరైనా జనవరి 22 న అయోధ్యకు వస్తే వారికి తగిన సౌకర్యాలు అందజేయలేం. స్థానిక అధికార యంత్రాంగం కూడా ప్రోటోకాల్ పాటించే పరిస్థితి లేదు’ అని చంపత్ రాయ్ స్పష్టం చేశారు.

శీతాకాలంలో వచ్చే ఇబ్బందులను దక్షిణ భారత యాత్రికులు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులను వివిధ సమయాల్లో ఆహ్వానించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలా వచ్చే వారికి వసతి, ఆహార సదుపాయాల ఏర్పాట్లను చేస్తామని తెలిపారు. ఇక, రామమందిర కింది అంతస్తు నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తవుతుంది. జనవరి 22 నుంచి 26 వరకూ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తారు.

మూడు దశల్లో ఆలయ నిర్మాణం జనవరి 2025 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోజులో 12 గంటల పాటు ఆలయం తెరిచి ఉంటే 70 నుంచి 75 వేల మంది సులభంగా దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. కింది అంతస్తులో మొత్తం 160 స్తంభాలు ఉన్నాయని, వివిధ రూపాల్లో 25 ఐకానోగ్రాఫికల్ వర్క్‌లను కలిగి ఉన్నాయని చెప్పారు.

రామమందిర నిర్మాణం మొదలుపెట్టిన ఫిబ్రవరి 5,2020 నుంచి 2023 మార్చి 31 వరకూ రూ.900 కోట్లు ఖర్చయ్యిందని, మరో రూ.3,000 కోట్లు బ్యాంకుల్లో ఉందని ట్రస్ట్ ఇటీవల వెల్లడించారు. ఇక, ఆలయ ప్రతిష్ఠాపన రోజున రాత్రి దేశంలోని ప్రతి ఒక్కళ్లూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని అభ్యర్థించింది. అంతేకాదు, ప్రతిష్ఠకు ముందు రాముడికి సమర్పించిన అక్షింతలను దేశవ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాలకు పంపిణీ చేస్తామని శ్రీరామజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.