తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ సంబరాలు

* నేటి నుండే 9 రోజుల పాటు సంబరాలు
 
తెలంగాణ రాష్ట్రంలోనే మహిళలకు అతిపెద్ద పండుగైన బతుకమ్మ సంబరాలు శనివారం నుంచే ప్రారంభం అవుతున్నాయి. వీధివీధిన వాడవాడనా బతుకమ్మ ఆటలు ఆడడానికి బాలికల నుంచి వృద్ద మహిళల వరకు సిద్దమవుతున్నారు. తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా కొనసాగే బతుకమ్మ వేడుకలతో ప్రతివీధి శోభాయమానంగా మారబోతుంది.
 
తెలంగాణలో అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమినుంచి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేబతుకమ్మ పండుగ సంబరాల ఏర్పాట్లలో  రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిమగ్నమైంది. మహాలయ అమాస్య నుంచి దుర్గాష్టమి వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జరుపుకునే ఈ పూలపండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంది.

అందుబాటులో ఉన్న చరిత్ర మేరకు కాకతీయ సామ్రాజ్యంలో పద్మాక్షి ఆలయం దగ్గర బతుకమ్మ వేడుకలను రాణీ రుద్రమదేవి ఘనంగా నిర్వహించడంతో పాటుగా పండుగ సంబరాల్లో పాల్గొనే వారు. నేటికి ఆలయం దగ్గర బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినఅనంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి అంతర్జాతీయ ఈ పండుగకు అంతర్జాతీయ ఖ్యాతితెచ్చారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగకు రోజుకో పేరుతో నిర్వహిస్తారు. తొమ్మిదిరోజుల పాటు మహిళలు చేసుకునే అతిపెద్ద పండుగకూడా బ్రతుకమ్మ అనే చెప్పవచ్చు.

మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బియ్యం బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, చివరి రోజు అశ్వయుజ అష్టమి నాడు సద్దుల బతుకమ్మగా పులుస్తూ అత్యంత వైభవంగా తెలంగాణ మహిళలు సంబరాలు జరుపుకుంటారు.

అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికారులు ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఎన్నిక కోడ్‌ అమల్లో ఉండటంతో బతుకమ్మ పండుగకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకు అనుమతి అవసరమని అధికారులు చెప్పారు.  ఎన్నికల కమిషన్‌ అనుమతి మేరకు సాస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రజలు ఆనందంతో స్వతహాగా చేసుకునే పండుగకు ఎన్నికల కోడ్‌ కు సంబంధం లేదని అధికారులు చెప్పారు.

రామరామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, అంటు ఉయ్యాల పాటలు, జానపదంలో నుంచి వచ్చే తెలంగాణ పాటలతో రాష్ట్రం మార్మోగనుంది. తొమ్మిది రోజుల పాటు మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించే ఈ పండుగకు ఎంతో విశిష్టత కూడా ఉంది.  అడవిపూలైన గుమ్మడి, తంగేడు, బంతి, గునుగు, తామరలాంటి పూలతో అందంగా అలంకరించి అనంతరం వాడవాడనా మహిళలంతా ఒకేచోట చేరుకుని సాయంత్ర సమయాల్లో అమ్మవారి పాటలు జానపద నృత్యాలు, కోలాటాలు ఇలా రకరకాలుగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని కొలుస్తారు.

తొమ్మిదో రోజున పెద్ద బతుకమ్మలను పేర్చి మహిళలంతా వాయనాలు ఇచ్చుకుని గ్రామచెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన పూల బతుకమ్మలను గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేయడం అనవాయితీ. అయితే అనాదిగా వస్తున్న ఈ ఆచారం వెనుక శాస్త్రపరిజ్ఞానం కూడా ఉందని పెద్దలంటున్నారు.

వర్షాకాలంలో వచ్చి చేరిన నీటిలో ప్రజలకు హనిచేసే అతిసూక్ష్మక్రిములుంటాయని, చెరువులో వేసే బ్రతుకమ్మపూలతో క్రిములు నశింపచేస్తాయని దీంతో చెరువునీటిని వాడినవారికి కలరా, మలేరియా లాంటి వ్యాధులు సోకకుండా ఉంటాయని చెబుతున్నారు.  అలాగే శరద్ఋతువులో ప్రారంభమయ్యే శరన్నవరాత్రుల్లో గౌరమ్మ రూపంలో అమ్మవారిని కొలుస్తుంటారు. అయితే పూలన్నీ శ్రీచక్ర స్వరూపంలో పేర్చి అందులో మధ్యన పసుపుతో తయారు చేసిన గౌరమ్మలను ఉంచి అమ్మవారి పాటలతో ప్రదక్షణా పూర్వకంగా తిరగడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. 

భాధ్రపద అమావాస్య మొదలుకుని ఎనిమిదిరోజుల పాటు చిన్నబ్రతుకమ్మలను పేర్చిన మహిళలు తొమ్మిదవరోజున పెద్దబ్రతుకమ్మలను తయారు చేసి పూజించిన అనంతరం డప్పుచప్పుళ్ల మధ్య గ్రామంలోని నిర్దేశిత ప్రాంతానికి వెళ్తారు. మహిళలందరు ఒకేదగ్గర చేరుకుని కొత్తబట్టలు,సత్తుపిండ్లు ఇలా అన్ని సమకూర్చుకున్నతర్వాత వాయనాలు ఇవ్వడంతో బ్రతుకమ్మ పండుగ పూర్తవుతుంది.