బీజింగ్‌లో ఇజ్రాయెలీ ఎంబసీ ఉద్యోగికి కత్తిపోట్లు

చైనాలోని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు శుక్రవారం కత్తిపోట్లకు గురయ్యాడు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని సమర్థిస్తూ చైనా చేసిన ప్రకటనను  ఇజ్రాయెల్ విమర్శించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. గాయపడిన ఉత్యోగి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఈ దాడికి ఎవరు బాధ్యులో ఇంకా తెలియరాలేదు.

తమ దౌత్యకార్యాలయానికి చెందిన ఉద్యోగి ఒకరు కత్తిపోట్లకు గురయ్యారని ఇజ్రాయెల్ విదేశీ మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది. అయితే, దౌత్య కార్యాలయం ప్రాంగణంలో ఈ దాడి జరగలేదని విదేశాంగ శాఖ తెలిపింది. కత్తిపోట్లకు గురైన ఉద్యోగికి సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ వెల్లడించలేదు. 

గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ శుక్రవారం ప్రార్థనల తర్వాత నిరసన తెలపాలని ముస్లిం దేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేయడం జరుగుతోందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆ ఉద్యోగి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ దాడికి సంబంధించిన కారణాలపై ఇజ్రాయెలీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. బీజింగ్‌లోని ఇజ్రాయెలీ ఎంబసీ వెలుపల కొద్ది మంది భద్రతా సిబ్బంది సాధారణ దుస్తులలో ఉన్నారు. ఇదే పరిస్థితి పాలస్తీనా ఎంబసీ వద్ద కూడా నెలకొని ఉంది.