విమానాశ్రయాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు

హమాస్‌ మిలిటెంట్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌ తాజాగా సిరియాను లక్ష్యంగా చేసుకున్నది. ఆ దేశ రాజధాని డమాస్కస్‌, మరో ప్రధాన నగరం అలెప్పోపై గురువారం దాడులకు దిగింది. రెండు నగరాల్లోని విమానాశ్రయాలపై బాంబుల వర్షం కురిపించింది.  ఇజ్రాయెల్‌ సేనల దాడుల కారణంగా రెండు విమానాశ్రయాల్లోని రన్‌వేలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
సిరియాకు చెందిన న్యూస్‌ ఏజెన్సీ సనా ఈ విషయాన్ని వెల్లడించింది. దాడుల విషయాన్ని జెరూసలేం పోస్ట్‌ ధ్రువీకరించింది.  ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడిన సమయంలో ఇరాన్‌ దౌత్యవేత్తల విమానం సిరియాలోని విమానాశ్రయంలో దిగాల్సి ఉన్నది. ఆ సమయంలోనే బాంబుల వర్షం కురిసింది. దీంతో ఇరాన్‌కు చెందిన మహన్‌ ఎయిర్‌ఫ్లైట్‌ అక్కడ ల్యాండ్‌ అవకుండానే వెనుదిరిగింది. ఇరాన్‌ లక్ష్యంగానే ఇజ్రాయెల్‌ దాడులు చేసినట్టు తెలుస్తున్నది. 
 
హమాస్‌ దాడుల వెనుక ఇరాన్‌ ఉందని ఇజ్రాయెల్‌ మొదట్నుంచి భావిస్తున్నది. దీంతో గురువారం సిరియా పర్యటనకు వచ్చిన ఇరాన్‌ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినట్టు పలువురు భావిస్తున్నారు. గాజాలోని హమాస్‌తో పాటు సిరియా నుంచి కూడా బుధవారం ఇజ్రాయెల్‌పై దాడులు జరిగాయి. 
 
సిరియాలో ఉన్న హమాస్‌ మద్దతుదారులు సరిహద్దుల్లోని ఇజ్రాయెల్‌ ప్రాంతాలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రతీకార చర్యల్లో భాగంగానే ఇజ్రాయెల్‌ ఈ దాడులకు పాల్పడినట్టు చెబుతున్నప్పటికీ అసలు లక్ష్యం వేరే ఉండొచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కాగా, ఇజ్రాయెల్‌ దాడులను సిరియా ఆర్మీ ఖండించింది. గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న మారణహోమాన్ని పక్కదారి పట్టించడానికే తమపై దాడులకు దిగినట్టు ఆ దేశ ఆర్మీ పేర్కొంది.

మరోవంక, పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ను నామరూపాల్లేకుండా చేసేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధమైంది. హమాస్‌ను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు సన్నాహాలు చేస్తున్నది. లక్షలాది మంది బలగాలతో గాజాలో అడుగుపెట్టి అక్కడి హమాస్‌ మిలిటెంట్లను ఏరివేయాలని ఇజ్రాయెల్‌ ప్రణాళికలు రచిస్తున్నది. భవిష్యత్తులోనూ హమాస్‌తో ముప్పు తప్పదని గ్రహించిన ఇజ్రాయెల్‌ ఆ గ్రూప్‌ కార్యకపాలను పూర్తిగా అంతమొందించేందుకు గాజాలో గ్రౌండ్‌ ఆపరేషన్‌ చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. 

వాడి గాజా ఉత్త‌ర ప్రాంతంలో ఉన్న సుమారు 11 ల‌క్ష‌ల మంది 24 గంట‌ల్లోగా  ద‌క్షిణ గాజా దిశ‌గా త‌ర‌లి వెళ్లాల‌ని ఇజ్రాయిల్ తెలిపింది. ఈ విష‌యాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితికి కూడా చేర‌వేసింది. ఆరు రోజుల పాటు రాకెట్ల వ‌ర్షంతో మునిగిపోయిన గాజాలో ప‌ట్టు కోసం ఇజ్రాయిల్ పూర్తి స్థాయి ఆప‌రేష‌న్‌కు సిద్ద‌మైంది. అయితే అతి త‌క్కువ స‌మ‌యంలో ఆ మొత్తంలో జ‌నాన్ని త‌ర‌లించ‌డం సాధ్యం కాదు అని ఐక్య‌రాజ్య‌స‌మితి పేర్కొన్న‌ది. ఒక‌వేళ అలాంటి ఆదేశాలు చేస్తే వాటిని ర‌ద్దు చేయాల‌ని యూఎన్ అభిప్రాయ‌ప‌డింది.

అయితే గాజాలోకి ప్రవేశించి మిలిటెంట్లను మట్టుబెట్టాలని ఇజ్రాయెల్‌ ప్లాన్‌ చేస్తున్నప్పటికీ అది అంత సులువు కాదని నిపుణులు చెబుతున్నారు. అత్యంత జనసాంద్రత ఉన్న ఉండే గాజా స్ట్రిప్‌లో ఇంటింటికి వెళ్లి మిలిటెంట్లను వెతికి హతం చేయడమనేది సాధ్యం కాకపోవచ్చని వారు పేర్కొంటున్నారు. గాజాలో ఉండే అండర్‌గ్రౌండ్‌ టన్నెళ్లు దీనికి ప్రధాన కారణం. 

మరోవైపు హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలు, అమెరికా తదితర ఇతర దేశాల పౌరులు ఇందుకు అవరోధంగా మారొచ్చని తెలుస్తున్నది. గ్రౌండ్‌ ఆపరేషన్‌పై ఇజ్రాయెల్‌ నాయకత్వం ఆచితూచి వ్యవహరించడానికి ఇది ఓ కారణమే.