ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు

ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు
ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించే ప్రతిపాదనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. క్రికెట్‌తో పాటు మరో ఐదు ఆటలకు ఒలింపిక్స్‌లో చోటు కల్పించింది. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోసీ, స్క్వాష్‌ క్రీడలకు చోటు కల్పించేందుకు బోర్డు అమోదం తెలిపినట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ మేరకు ట్వీట్ చేసింది.
 
ప్రపంచంలో ఫుట్‌బాల్, టెన్నిస్ తర్వాత అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే, చూసే ఆట క్రికెట్. ఇప్పటికే చాలా దేశాలు క్రికెట్ ఆడటం ప్రారంభించాయి. ఐసీసీ సభ్యదేశాలుగా కూడా ఉన్నాయి. అయితే ఇంత ప్రఖ్యాతి పొందిన క్రికెట్‌కు ఇప్పటి వరకూ ఒలింపిక్స్‌లో చోటు దక్కలేదు. ఇటీవలే ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చగా ఘనంగా విజయవంతమైనది. భారత జట్టే మహిళలు, పురుషుల విభాగాల్లో గోల్డ్ కైవసం చేసుకుంది. 
 
అయితే ఒలింపిక్స్‌ లాంటి విశ్వక్రీడా సంబరంలో క్రికెట్‌ను కూడా చేర్చాలని చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆసియా క్రీడల తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2028 లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. 
 
ఐవోసీ ఆమోదించిన నిర్ణయాలను ఒలింపిక్స్ ప్రోగ్రామ్ కమిషన్ సమీక్షిస్తుంది. ఓటింగ్ తర్వాత అధికారికంగా క్రికెట్ ఒలింపిక్స్‌లో చేరుతుంది. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించడం వెనుక కూడా ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయి. 
 
ఒలింపిక్స్‌లో భారత దేశం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మన దేశంలో ఒలింపిక్స్‌ను టీవీల్లో చూసే వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. బాగా పేరొందిన  క్రీడాకారుల ఈవెంట్ల సమయంలోనే భారతీయులు ఒలింపిక్స్ వైపు కన్నేస్తారు. అత్యధిక జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ఈ పరిణామాల వలన ఐవోసీకి పెద్దగా ఆదాయం ఉండదు.

ఈ నేపథ్యంలో మనదేశంలో క్రికెట్‌కు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతోనే క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే ప్రతిపాదనకు ఐవోసీ అంగీకరించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రసార హక్కుల వేలం ద్వారా ఐవోసీ రూ.150 కోట్ల నుంచి రూ.160 కోట్ల వరకూ సంపాదిస్తోంది. క్రికెట్‌ను చేర్చితే ఈ సంఖ్య వేలకోట్లలోకి వెళ్తుందని ఓ అంచనా.