ఇజ్రాయెల్ నుంచి భారతీయులతో తిరిగివచ్చిన తొలి విమానం

పాలస్తీనాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి మొదటి విడతగా సుమారు 212 మంది భారతీయులు శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి తిరిగివచ్చారు. ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి తిరిగి రావాలని ఆశిస్తున్న భారతీయుల కోసం `ఆపరేషన్ అజయ్’ పేరిట భారత ప్రభుత్వం ప్రత్యేక విమాన సర్వీసులను నిర్వహిస్తోంది.

శుక్రవారం తెల్లవారుజామున అద్దె విమానంలో విద్యార్థులతోసహా 212 మంది భారతీయులు న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. వారికి విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు.  స్వదేశానికి తిరిగి వచ్చిన వారిలో ఇజ్రాయెల్‌లో 2019 నుంచి నివసిస్తున్న వ్యవసాయ పరిశోధకుడు శాశ్వత్ సింగ్ సింగ్ ఉన్నారు. బాంబుల మోతలు, సౌరన్లతో తాము నిద్రలేచామని, ఈ యుద్ధం ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందో అర్థం కావడం లేదని భార్యతో కలసి స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన చెప్పారు.

ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని, వెస్ట్ బ్యాంక్‌లో డజను మంది, గాజాలో ముగురు లేదా నలుగురు భారతీయులు నివసిస్తున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందం బగ్చి గురువారం వెల్లడించారు.

ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న వారిలో ఇజ్రాయెల్‌లోని బీర్‌షేబాలో గల బెన్ గురియన్ యూనివర్సిటీలో పిహెచ్‌డి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సుపర్ణో ఘోష్ కూడా ఉన్నారు. తాము షెల్టర్లలో తలదాచుకున్నామని, ఇజ్రాయెల్‌లో అనేక చోట్ల షెల్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, తామంతా సురక్షితంగా అందులో ఉన్నామని ఆయన చెప్పారు.

“మేము ఇజ్రాయెల్ లో ఇలాంటి పరిస్థితిని చూడటం ఇదే తొలిసారి. మమ్మల్ని తిరిగి తీసుకువచ్చినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. యుద్ధ భయాలు త్వరగా తొలగిపోతాయని ఆశిస్తున్నాం. తద్వారా మేము అక్కడికి తిరిగి వెళ్ళగలం” అని ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు.
ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
ఇజ్రాయేల్ దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతోన్న పోరు తీవ్రం కావడంతో భారత్ అప్రమత్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసింది. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉందని భావించిన ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వీధుల్లో భారీగా పోలీసులను మోహరించారు. 
 
అలాగే, ఇజ్రాయేల్ ఎంబసీ, యూదుల మతపరమైన ప్రదేశాల వద్ద భద్రతను పెంచారు. ఇజ్రాయేల్‌-పాలస్తీనా సరిహద్దుల్లో పెరుగుతున్న హింసను దృష్టిలో ఉంచుకుని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో సహా అనేక దేశాలు అక్కడ యూదులు, పాలస్తీనా అనుకూల నిరసనల విషయంలో భద్రతను పెంచిన తర్వాత భారత్ ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.