ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు కలిసి రాకపోవడం బాధాకరం

ప్రపంచ వ్యాప్తంగా పెను భూతంలా విస్తరిస్తున్న ఉగ్రవాదం()పై కొన్ని దేశాలు ఉమ్మడి పోరుకు ముందుకు రాకపోవడం బాధాకర విషయమని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జీ – 20 పార్లమెంటరీ సమ్మిట్ ని శుక్రవారం ప్రారంభిస్తూ 2001లో పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి ఘటనల్ని గుర్తు చేసుకున్నారు.
 
ప్రపంచం ఇప్పుడు ఉగ్రవాద సమస్యతో కొట్టుమిట్టాడుతోందని, అయినా అన్ని దేశాలు కలిసి కట్టుగా ఉగ్రవాదంపై పోరాడటానికి ముందుకు రావట్లేదని పేర్కొన్నారు. దీనిని ఎదుర్కోవడానికి కలిసి పని చేసే విధానంపై అన్ని దేశాల పార్లమెంటుల్లో చర్చ జరగాలని ప్రధాని కోరారు. ‘భారత్ దశాబ్దాలుగా ఉగ్రవాద సమస్య ఎదుర్కుంటోంది. ఉగ్రవాదులు వేల సంఖ్యలో అమాయక ప్రజలను హతమారుస్తున్నారు. ఈ సమస్య అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెను సవాలును విసురుతోంది’ అని తెలిపారు. 
 
అదే సభలో ప్రధాని ఇజ్రాయెల్ – పాలస్థీనా మధ్య జరుగుతున్న యుద్ధంపై స్పందిస్తూ యుద్ధాలు, సంఘర్షణలు ఎవరికీ ప్రయోజనాలు కల్పించవని మోదీ స్పష్టం చేశారు. పైగా తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలు కలిగించి, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తాయని స్పష్టం చేశారు.  ప్రపంచం ముందున్న సవాళ్లను వదిలేసి కొత్త సమస్యలు తెచ్చుకుంటే అన్ని దేశాలు అంధకారంలోకి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. 
ఒకే భూమి, ఒకే ప్రపంచం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సవాళ్ల పరిష్కారానికి ప్రజల భాగస్వామ్యమే మంచి పరిష్కారంగా మోదీ అభివర్ణించారు.  ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూడాలని, సంఘర్షణ ఎవరికీ ప్రయోజనం కాదు అని చెప్పారు. ఇది శాంతి కాలం. అందరూ కలిసి కదలాలి.. అని సూచించారు. 
ఉగ్రవాదం ఎక్కడ జరిగినా, ఏ కారణం చేతనైనా, ఏ రూపంలో వచ్చినా అది మానవత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.  ఉగ్రవాదానికి సంబంధించిన మరో ప్రపంచ కోణం ఉందని చెబుతూ ఉగ్రవాదం నిర్వచనానికి సంబంధించి ఇప్పటి వరకు ఏకాభిప్రాయం కుదరకపోవడం చాలా బాధాకరమని ప్రధాని పేర్కొన్నారు.
ఈ రోజు కూడా ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై అంతర్జాతీయ సమావేశం ఏకాభిప్రాయం కోసం వేచి ఉందని చెప్పారు. ప్రపంచపు ఈ వైఖరిని మానవత్వపు శత్రువులు సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.