మహిళలు, పిల్లల సంబంధిత సైబర్ నేరాలకు అడ్డుకట్టు

 
మహిళలు, పిల్లలూ సంభందిత సైబర్ నేరాలకు పూర్తి అడ్డుకట్ట వేయాలని  ఏపీ డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఇతర దేశాలతో పరస్పర చట్టపరమైన సహాయ ఒప్పందాల  అమలుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను సమన్వయం చేయడానికి గల అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలని చెప్పారు.
 
విశాఖపట్టణంలో జరిగిన నాలుగవ రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జాయింట్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ టీమ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టడంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో పనిచేస్తూ సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతీ సంవత్సరం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు.

ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు పూర్తి సమన్వయంతో సైబర్ నేరాలను అదుపు చేయాలనీ, అందులో భాగంగా పలు సమాచారాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పారు. 

సైబర్ నేర కేసులను మరింత సమర్థవంతంగా పరిశోధన చేసి, సైబర్ నేరగాళ్లకు శిక్షలు పడేలా చేయడం, అదే సమయంలో పోగొట్టుకున్న నగదు తిరిగి బాధితులకు అందేలా చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ నూ అరికట్టే పలు ఆధునిక పరిజ్ఞానాలు, సిబ్బంది శిక్షణ, పలు టీమ్ ల ఏర్పాటు, అవగాహనా విధానాలు ఇతర చర్యలపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్, ఒడిశాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, అండమాన్ & నికోబార్, పుదుచ్చేరిలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రం హోంశాఖ ఇంటర్నల్ సెక్యూరిటీ స్పెషల్ సెక్రెటరీ శివగామి సుందరీ నందా ఈ సదస్సులో పాల్గొన్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నార్‌తో పాటు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులుగా సుమారు 50 మంది పోలీసు ఉన్నతాధికారులు ఈ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.