చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ 17కు వాయిదా

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది.  స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే ఇరువైపు వాదనలు విన్నది సుప్రీంకోర్టు. అయితే శుక్రవారం తీర్పు వచ్చే అవకాశం ఉందని అంతా భావించినప్పటికీ మరోసారి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. 
 
ప్రధానంగా 17ఏపైనే మరోసారి చంద్రబాబు తరపు న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. దాదాపు గంటకు పైగా ఆయన వాదనలు కొనసాగించారు. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్‌ 17ఎతో రక్షణ లభించిందని గుర్తు చేశారు. ఇందుకు పలు కేసులను కూడా ఉదహరించారు. స్కిల్‌ కేసులోనూ చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ చట్టబద్ధం కాదని పునరుద్ఘాటించారు.  
 
మరోవైపు ఏపీ సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తూ స్కిల్ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి  తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారని తెలిపారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలని స్పష్టం చేశారు. 

17ఏ అన్నది అవినీతికి రక్షణ కాకూడదని చెబుతూ వాదించారు. చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు పాత చట్టంలోని సెక్షన్స్ వర్తిస్తాయని పేర్కొన్నారు. చట్టాన్ని రద్దు చేసినా వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పటి చట్టమే వర్తిస్తుందని చెప్పారు.

ఇదిలా ఉండగా ఫైబర్‌నెట్‌ కేసులోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ ఫైబర్‌ నెట్‌ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చిందని చెబుతూ కొందరికి ముందస్తు బెయిల్‌, మరి కొంతమందికి రెగ్యులర్‌ బెయిల్‌ ఉన్నప్పుడు చంద్రబాబుకు బెయిల్‌ ఎందుకివ్వరని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.  వాదనల అనంతరం విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు  ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్

అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. లక్ష పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేశారు. చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు లక్ష రుపాయల పూచీకత్తుతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంగళ్లు కేసులో 179మంది నాయకులపై పోలీసులు కేసు పెట్టారు. అంగళ్లు కేసులో చంద్రబాబు కస్టడీలో లేనందున చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గత వారం తోసిపుచ్చింది. తాజాగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.