చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట 

చంద్రబాబు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ కేసులో చంద్రబాబు 32 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. సుప్రీంకోర్టులో ఈ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ తదుపరి విచారణ ఈ నెల 13న జరగనుంది. ఈ సమయంలో చంద్రబాబును అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసుల్లో అరెస్ట్ చేకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. 
 
ముందుగా ఈ పిటీషన్లపై చంద్రబాబు తరపు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. తిరిగి రెగ్యులర్ కోర్టులో పిటీషన్లు దాఖలు చేయగా బుధవారం విచారణ జరిగింది. పూర్తి స్థాయి విచారణకు సమయం ఇవ్వాలని, ముందుగా మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.
 
అయితే, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఈ సమయంలో బెయిల్ ఇవ్వటం సరి కాదని వాదించారు. రెండు పక్షాల వాదనల తరువాత హైకోర్టు పీటీ వారెంట్లు పెండింగ్ లో ఉన్న అంగళ్లు కేసులో గురువారం వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సోమవారం వరకు అరెస్ట్ చేకుండా ఊరట ఇచ్చింది. 
 
అయితే, ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే సీఐడీ ఏసీబీ కోర్టులో సీటీ వారెంట్ దాఖలు చేసింది. దీని పైన ఈ మధ్నాహ్నం లేదా రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. అంగళ్లు కేసులోనూ రేపటి వరకే కోర్టు అరెస్ట్ చేయకుండా మినహాయింపు ఇచ్చింది. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది. దీంతో చంద్రబాబుకు కొంత ఊరట దక్కినట్లు అయ్యింది.