ఇజ్రాయెల్ రక్షణ కవచం.. “ఐరన్ డోమ్” ఎలా పని చేస్తుందంటే?

ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల దాడి నేపథ్యంలో.. మధ్య ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలముకున్నాయి. దాడులు, ప్రతి దాడులతో ఇటు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్, అటు ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలు రణ రంగాన్ని తలపిస్తున్నాయి. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. భారీ సంఖ్యలో క్షతగాత్రులుగా మిగులుతున్నారు.

కాగా హమాస్ మిలిటెంట్లు నిమిషాల వ్యవధిలో ఐదు వేల రాకెట్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్ లోని నగరాలే లక్ష్యంగా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు దాడులకు దిగారు. అయితే ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఉన్నప్పటికి దాడులు ఎలా జరిగాయన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ హమాస్ మిలిటెంట్లు 20 నిమిషాల వ్యవధిలో ఐదు వేల రాకెట్లను ప్రయోగించినప్పటికి.. ఇజ్రాయెల్ కు రక్షణ కవచంలా ఉన్న ఐరన్ డోమ్ 90 శాతం రాకెట్లను అడ్డుకుందని.. ఆకాశంలోనే వాటిని కూల్చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందుకే ప్రాణ నష్టం కాస్త తక్కువగా ఉందని పేర్కొన్నారు. మరి ఇజ్రాయెల్ వద్ద ఉన్న అద్భుత రక్షణ కవచం ఐరన్ డోమ్ విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

రాఫెల్ అడ్వాన్స్ డ్ డిఫెన్స్ సిస్టమ్ అనే ప్రభుత్వ సంస్థ 2011లో దీన్ని తయారు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా శత్రు దేశాల స్వల్ప శ్రేణి రాకెట్లు, క్షిపణులను అడ్డుకొని గాల్లోనే వాటిని తునాతునకలు చేస్తోంది. ఈ వ్యవస్థలో ఉండే బ్యాటరీ ఆధారిత రాడార్ సిస్టం తమవైపు దూసుకొచ్చే రాకెట్ల వేగం, ట్రాజెక్టరీ, లక్ష్యాన్ని ముందుగానే పసిగట్టి వాటిని సమర్థంగా అడ్డుకుంటుంది. 2011లో గాజా స్ట్రిప్ నుంచి 40 కిమీ దూరంలో ఉన్న బీర్షేవా లో దీన్ని మొదటగా పరీక్షించారు. ప్రస్తుతం ఇటువంటి ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ వద్ద పది దాకా ఉన్నట్లు సమాచారం.

ఐరన్ డోమ్ లో మొత్తం మూడు వ్యవస్థలు ఉంటాయి. రాడార్, బ్యాటిల్ మేనేజ్ మెంట్ అండ్ వెపన్ కంట్రోల్ సిస్టమ్(బీఎంసీ), మిసైల్ ఫైరింగ్ యూనిట్. శత్రువులు ప్రయోగించే రాకెట్లను రాడార్ పసిగట్టి.. దాని గమనాన్ని బీఎంసీకి పంపిస్తుంది. రాకెట్ వేగం, పడే ప్రాంతాలను అంచనా వేసి మిసైల్ ఫైరింగ్ యూనిట్ కు బీఎంసీ సందేశం అందిస్తుంది. అనంతరం ఐరన్ డోమ్
నుంచి వెలువడే టిమిర్ క్షిపణులు ప్రత్యర్థుల రాకెట్లను గాల్లోనే పేల్చేస్తాయి. ఇవన్నీ క్షణాల్లోనే జరిగిపోతాయి.

ఈ ఐరన్ డోమ్ వ్యవస్థలో అతి కీలకమైన విషయం ఏమిటంటే.. శత్రువులు ప్రయోగించిన రాకెట్ లక్ష్యాన్ని అంచనా వేయడం మాత్రమే కాదు సదరు రాకెట్ తన టార్గెట్ ను చేరగలదా లేదా అనేది కూడా క్షణాలలో లెక్కలేస్తుంది. ఆ టార్గెట్ లో పౌరులు కానీ, కీలకమైన భవనాలు కానీ ఉంటే వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఎదురుదాడి చేసి ఆ రాకెట్ ను మధ్యలోనే కూల్చేస్తుంది. అలా కాకుండా శత్రువుల రాకెట్ ఎంచుకున్న టార్గెట్ చేరినప్పటికీ ఇజ్రాయెల్ కు పెద్దగా నష్టం లేదని తేలితే ఎదురుదాడి చేయదు. అంటే శత్రువుల రాకెట్ ను ఉద్దేశపూర్వకంగానే వదిలేస్తుంది. దీనివల్ల ఆయుధ నష్టాన్ని నివారిస్తుంది.

ఇక ఇజ్రాయెల్‌, పాలస్తీనా హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ప్రధానంగా గాజా స్ట్రిప్‌, ఇజ్రాయెల్‌ దక్షిణ ప్రాంతంలో యుద్ధ ప్రభావం కనిపిస్తున్నది. ఇప్పటికే రెండు వైపులా 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక్క ఇజ్రాయెల్‌లోనే 44 మంది సైనికులు సహా 700 మందికిపైగా మృతి చెందారు.

ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మికంగా దాడి చేసి తూటాల వర్షం కురిపించారు. రెండు దేశాల బార్డర్‌ వద్ద జరుగుతున్న ఓ మ్యూజికల్‌ పార్టీపై మిలటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కనిపించిన వారిని కనిపించినట్లు పిట్టల్లా కాల్చి చంపేశారు. దీంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. ఆ ప్రదేశంలో మృతదేహాలు రక్తంమడుగుల్లో చల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే ఇప్పటి వరకూ 260 మృతదేహాలను మెడికల్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ రెస్క్యూ సర్వీస్‌ వెల్లడించింది.