మధ్య ఆసియాలో కొనసాగుతున్న మారణ హోమం..

దాడులు, ప్రతిదాడులతో మధ్య ఆసియాలో రక్తపుటేర్లు పారుతున్నాయి. వ్యూహాత్మకంగా దాడికి పాల్పడ్డ హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించడంతో.. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సేనల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఓ వైపు గాజా సరిహద్దు వెంబడి పోరు జరుగుతుండగా.. వెస్ట్ బ్యాంక్ సరిహద్దులో కూడా సేనలు మోహరించాయి. మరోవైపు లెబనాన్ కు చెందిన హెజ్ బొల్లా మిలిటెంట్ గ్రూపు కూడా హమాస్ కు మద్దతుగా యుద్ధక్షేత్రంలోకి దిగింది. దీంతో పరిస్థితి మరింత విషమంగా మారింది.
ఇటు హమాస్ ముష్కరులు జరిపిన వ్యూహాత్మక దాడుల్లో.. ఇజ్రాయెల్ విలవిల్లాడిపోయింది. పక్కా ప్లాన్ ప్రకారమే భూమి, ఆకాశం, సముద్రం గుండా ప్రవేశించిన ముష్కరులు.. ఎంతటి ఘాతుకానికి పాల్పడ్డారో.. కాస్త ఆలస్యంగా బయటి ప్రపంచానికి తెలుస్తోంది. గాజా సరిహద్దులోని నెగెవ్ ఎడారిలో నిర్వహించిన సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పై విరుచుకుపడ్డ మిలిటెంట్లు.. ఏకంగా 260 మందిని పొట్టనపెట్టుకున్నారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. దొరికిన వారిని దొరికినట్లుగా చంపేశారు. మ్యూజిక్ లవర్స్ పై బుల్లెట్ల వర్షం కురిపించారు.
అయితే ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్దంతో.. ప్రపంచదేశాల వైఖరిపై మరోసారి చర్చ జరుగుతోంది. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తుంటే.. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలన్నీ పాలస్తీనా వెంట ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నట్లు భారత్ ప్రకటించింది. హమాస్ మిలిటెంట్ల అనూహ్య దాడులను ఖండించిన భారత్.. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని స్పష్టం చేసింది. అలాగే అమెరికా, ఇంగ్లాండ్ సహా.. యూరప్ దేశాలన్నీ ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించాయి. ఆల్ రెడీ ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా యుద్ధనౌకలు కూడా రంగంలోకి దిగాయి.
కానీ ఇస్లామిక్ దేశాలన్నీ హమాస్ వైపు నిలబడ్డాయి. ఇజ్రాయెల్ తీరును ఖండించాయి. 57 ముస్లీం దేశాల కూటమి అయిన ఇస్లామిక్ సహకార సంస్థ.. హమాస్ కు మద్దతు తెలిపింది. ఆల్ రెడీ హమాస్ వెనుక ఉన్నది ఇరాన్ అని.. అధికారికంగానే ప్రకటించారు. లెబనాన్ లోని హెజ్ బొల్లా, పాలస్తీనాలోని హమాస్ కు ఇరాన్ సాయం చేస్తుందనేది బహిరంగ రహస్యం. హెజ్ బుల్లా గ్రూప్ షియా గ్రూప్ అయితే.. హమాస్ సున్నీ గ్రూపు. అయితే ఇరాన్ సాయం వెనుక రష్యా ఉన్నట్లు.. కథనాలు వినిపిస్తున్నాయి. రష్యా ఆజ్ఞతోనే ఇరాన్.. సున్నీ గ్రూప్ అయిన హమాస్ కు అన్నిరకాలుగా సాయం అందిస్తుందనేది ఆ కథనాల సారాంశం.
వాస్తవానికి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటున్న సమయంలో.. హమాస్ దాడి పూర్తిగా వ్యూహాత్మకంగా జరిగిందని చెబుతున్నారు. ఉక్రేయిన్ – రష్యా యుద్దంలో నాటో దళాలు ఉక్రేయిన్ కు సాయం చేయడాన్ని వ్యూహాత్మకంగా తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగానే.. రష్యా ఆదేశంతో ఇరాన్, హమాస్ కు సాయం చేసిందని.. చెబుతున్నారు. దీంతో ఈ సమయంలో సౌదీ ఎవరివైపు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే తాము హమాస్ కు మద్దతిస్తున్నట్లు సౌదీ స్పష్టం చేసింది.