ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం.. ప్రధాని మోదీ భరోసా

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం.. ప్రధాని మోదీ భరోసా
ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులతో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ట్విటర్ వేదికగా ఈ దాడులను ప్రధాని మోదీ ఖండించారు. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. 
 
ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. హమాస్ మిలిటెంట్ల చేస్తున్న భీకర దాడుల వార్తలు విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే ఇజ్రాయెల్‌లో ఉన్న అమాయక పౌరుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందినట్లు తెలిపారు. బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 
 
ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉన్న స్థానికులు, విదేశాలకు చెందిన పౌరులు క్షేమంగా ఉండాలని ప్రధాని ప్రార్థించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు భారత్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.  ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందనపై భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలెన్ మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి నౌర్ గిలెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ నైతిక మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ బలపడుతుందని, హమాస్ ఉగ్రవాదులపై విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి నేపథ్యంలో ఆ దేశానికి విమాన సర్వీసులను ఎయిర్‌ ఇండియా రద్దు చేసింది. ఏఐ 139 విమానం శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 7.05 గంటలకు టెల్ అవీవ్ చేరుకోవాల్సి ఉంది.  తిరుగు ప్రయాణంలో ఏఐ140 విమానం టెల్ అవీవ్ నుంచి రాత్రి 10.10 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 7 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే శనివారం ఉదయం ఇజ్రాయిల్‌పై హమాస్‌ అనూహ్యంగా దాడి చేయడంతో, ప్రతిగా ఇజ్రాయిల్‌ కూడా ఎదురు దాడులు ప్రారంభించింది. 

కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా శనివారం ఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. సంబంధిత ప్రయాణికులకు అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొంది. మరోవైపు పలు అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా ఇజ్రాయిల్‌కు విమాన సేవలను నిలిపివేశాయి. జర్మన్ విమానయాన సంస్థ లుఫ్తాన్సా, స్విస్ ఎయిర్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో సహా అనేక విమానయాన సంస్థలు ఇజ్రాయిల్‌కు విమానాలను రద్దు చేశాయి.