రోజుకు రూ 200 కోట్లు కొల్లగొట్టిన మహాదేవ్ యాప్

మ‌హ‌దేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి గ‌త నెల‌లో ఈడీ 39 ప్ర‌దేశాల‌లో చేపట్టిన దాడుల్లో గోల్డ్ బార్స్‌, జ్యూవెల‌రీ, రూ. 417 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. ఈ యాప్‌ను ప్ర‌మోట్ చేస్తూ యాడ్స్‌లో క‌నిపించిన బాలీవుడ్ స్టార్స్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌ల‌కు ఇటీవ‌ల‌ ఈడీ స‌మ‌న్లు జారీ చేయ‌డంతో మ‌హ‌దేవ్ యాప్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.
 
భార‌త్‌, మ‌లేషియా, థాయ్‌ల్యాండ్‌, యూఏఈలో వంద‌లాది కాల్ సెంట‌ర్స్‌ను ఏర్పాటు చేసిన కంపెనీ రోజుకు వేలాది కోట్ల లావాదేవీలు నిర్వ‌హిస్తుంది. బెట్టింగ్, గేమ్స్ లావాదేవీల‌తో కంపెనీ రోజుకు రూ. 200 కోట్ల లాభాల‌ను ఆర్జిస్తుంద‌ని ఈడీ ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. ఈ కేసులో ఇప్ప‌టికే న‌లుగురు నిందితుల‌ను ఈడీ అరెస్ట్ చేసింది.
 
మ‌హాదేవ్ బుక్ అనేది ఒక ఆన్‌లైన్ బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్‌. దీని ద్వారా అక్ర‌మంగా మ‌నీలాండ‌రింగ్ జ‌రుగుతుంద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాంతో ఈడీ అధికారులు వీటిపైనా ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ యాప్ ప్ర‌మోట‌ర్ సౌర‌భ్ చంద్ర‌క‌ర్. ఇత‌ను ఫిబ్ర‌వ‌రి 2023లో దుబాయ్‌లో అత్యంత ఆర్భాటంగా వివాహం చేసుకున్నారు. 
 
ఈ వివాహానికి సుమారుగా రూ. 200 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలియడంతో ఈ యాప్ కార్య‌క‌లాపాల‌పై ద‌ర్యాప్తు సంస్ధ‌లు దృష్టి సారించాయి. ఈ  మొత్తం న‌గ‌దు రూపంలోనే చెల్లించ‌డంతో ఈడీ ఆ గుట్టుమ‌ట్ల‌ను ఆరా తీసింది.   దుబాయ్‌లో జ‌రిగిన చంద్ర‌క‌ర్ వివాహానికి బాలీవుడ్ తార‌లతో పాటు పాకిస్థాన్ గాయకులు అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్ కూడా హాజ‌ర‌యిన‌ట్లు తెలుస్తోంది. 
 
ఇప్ప‌టికి ఈ బెట్టింగ్‌కు సంబ‌ధించి ఈడీ జ‌రిపిన ద‌ర్యాప్తులో సుమారు రూ. 5000 కోట్ల మేరకు అవినీతి జ‌రిగింద‌ని తెలుస్తోంది. మ‌హ‌దేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ను సౌర‌భ్ చంద్రార్క‌ర్‌, ర‌వి ఉప్ప‌ల్ దుబాయ్ నుంచి నిర్వ‌హిస్తున్నారు. వీరిద్ద‌రూ చ‌త్తీస్‌ఘ‌ఢ్‌లోని భిలాయ్‌కు చెందిన వారిగా గుర్తించారు. 
 
ఈ కంపెనీ త‌ర‌చూ న్యూ వెబ్‌సైట్స్ క్రియేట్ చేయ‌డం, చాట్ యాప్స్‌లో గ్రూప్స్ ద్వారా కొత్త క‌స్ట‌మ‌ర్ల‌ను కంపెనీ ఆక‌ట్టుకుంటుంది.  సోష‌ల్ మీడియా యాప్స్‌లో పెయిడ్ అడ్వ‌ర్టైజ్‌మెంట్ల ద్వారానూ క‌స్ట‌మ‌ర్ల‌ను కంపెనీ స‌మీక‌రిస్తుంది. వాట్సాప్ ద్వారా యూజ‌ర్ల‌ నెంబ‌ర్ల‌ను కంపెనీ ప్ర‌తినిధులు సంప్ర‌దించి వారిని బెట్టింగ్ ఉచ్చులోకి లాగుతార‌ని ఈడీ వెల్ల‌డించింది.
 
యాప్ ప్ర‌మోట‌ర్లు సౌర‌భ్‌, ర‌వి ఉప్ప‌ల్ భార‌త‌దేశంలో నాలుగువేల మంది ఆప‌రేటర్ల‌ను నియ‌మించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఒక్కో ఆప‌రేట‌ర్‌కు సుమారు 200 మంది క‌స్ట‌మ‌ర్లు ఉన్నార‌ని స‌మాచారం. అంటే, ఈ లెక్క‌న రోజుకు 200 కోట్ల రూపాయ‌లు చేతులు మారుతున్నాయ‌ని అర్థం. ఈ యాప్ ప్ర‌మోట‌ర్లు సౌర‌భ్‌, ర‌వి ఉప్ప‌ల్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
 
డ‌బ్బు సేక‌రించి, చెల్లింపులు చేప‌ట్టేందుకు వాడే ఖాతాల‌న్నీ త‌ప్పుడు ప‌ద్ధ‌తిలో తెరిచిన బినామీ ఖాతాలేన‌ని ద‌ర్యాప్తు సంస్ధ పేర్కొంది. అన్ని గేమ్స్‌, బెట్స్‌ను కంపెనీ డబ్బు న‌ష్ట‌పోకుండా మ‌హ‌దేవ్ యాప్ ర‌న్ చేస్తుంది. ఇక తొలుత లాభ‌ప‌డిన న్యూ యూజ‌ర్లు ఆపై అధిక లాభాల కోసం పెద్ద‌మొత్తంలో డ‌బ్బును స‌మీక‌రించి బెట్స్‌, గేమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే దీర్ఘ‌కాలంలో వీరంతా భారీగా న‌ష్ట‌పోతారు.

ఇప్ప‌టికే అక్టోబ‌ర్ 4న స్టార్ హీరో రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 6న రణబీర్ కపూర్‌ను విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు స‌మ‌న్లు జారీ చేశారు. అయితే ర‌ణ‌బీర్ క‌పూర్ ఈడీని రెండు వారాల స‌మ‌యం అడిగారు. 
 
ఇప్పుడు తాజాగా, కపిల్ శర్మ, హుమా ఖురేషీ, శ్రద్ధా కపూర్, హీనా ఖాన్‌లకు ఈడీ సమన్లు పంపినట్లు తెలుస్తోంది. ఇంకా ఇందులో 14 మంది బాలీవుడ్ తార‌లు ఉన్న‌ట్లు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అందులో సన్నీలియోన్, కృష్ణ అభిషేక్, పుల్కిత్ సామ్రాట్ వంటివారు ఉన్నారు. 
అయితే ఆ 14 మంది తారల్లో కపిల్, హుమా, శ్రద్ధా, హీనా పేర్లు లేక‌పోవ‌డం విశేషం. అయితే ఇప్పుడు ఈ నలుగురి తార‌ల‌కు కూడా సమన్లు పంపించారు ఈడీ అధికారులు.