సిక్కిం వరదల్లో అలనాటి తెలుగు నటి గల్లంతు

ప్రముఖ సీనియర్ నటి సరళ కుమారి ఇటీవలి సిక్కిం వరదల్లో గల్లంతైనట్టు తెలిసింది. ఈ విషయాన్ని అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె నబిత ధ్రువీకరించారు. అమ్మ ఆచూకీని గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న సరళ కుమారి అక్టోబర్ 2న స్నేహితులతో కలసి సిక్కిం పర్యటనకు వెళ్లినట్టు ఆమె కుమార్తె చెప్పారు. అక్కడ ఓ హోటల్ లో బస చేసినట్టు తెలిపారు.

చివరిగా ఈ నెల 3న అమ్మతో ఫోన్ లో మాట్లాడానని, ఆ తర్వాత అమ్మతో సమాచారం లేదంటూ నబిత వెల్లడించారు. ‘‘వరదలు వచ్చినట్టు వార్తలు చూసి తెలుసుకున్నాను. ఆర్మీ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసినప్పటికీ కలవడం లేదు’’ అని నబిత ఆవేదన వ్యక్తం చేశారు.  దయచేసి అమ్మ ఎక్కడ ఉందో ఆచూకీ కనుక్కోవాలని కోరారు. 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైన సరళ కుమారి ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘దాన వీర శూర కర్ణ’లో నటించారు. ‘సంఘర్షణ’ తదితర సినిమాల్లోనూ నటించారు.

కాగా, సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వరదల్లో చిక్కుకుని మరణించిన వారి సంఖ్య 53కి చేరింది. చనిపోయిన వారిలో ఏడుగురు జవాన్లు కూడా ఉన్నారు. ఇక పొరుగున్న ఉన్న పశ్చిమబెంగాల్‌లోని తీస్తా నదిలో ఇప్పటివరకు 26 మృతదేహాలు లభ్యమైనట్లు శుక్రవారం విడుదల చేసిన సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (ఎస్‌ఎస్‌డిఎంఎ) నివేదిక పేర్కొంది. ఇంకా 142 మంది గల్లంతయ్యారని ఈ నివేదిక తెలిపింది. 

ఈ వరదల కారణంగా 2,413 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారని, సుమారు 1203 ఇళ్లు దెబ్బతిన్నాయని ఈ ఎస్‌ఎస్‌డిఎంఎ నివేదిక తెలిపింది. ఈ వరదల వల్ల సుమారు 25,065 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 6875 మంది 22 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారని సిక్కిం విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. 

వరదల కారణంగా 13 వంతెనలు వరదలో కొట్టుకుపోయాయని, ఉత్తర సిక్కింలో కమ్యూనికేషన్‌కు అంతరాయం ఏర్పడినట్లు ఎస్‌ఎస్‌డిఎంఎ నివేదిక తెలిపింది. వదరల నేపథ్యంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ శుక్రవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సహాయక చర్యలు, పునరుద్దరణ పనులపై సమీక్షించారు. 

చుంగ్‌తంగ్‌ వరకు రోడ్డు కనెక్టివిటీని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. నాగా నుంచి టూంగ్‌ వరకు వీలైనంత త్వరగా రహదారిని నిర్మించాలని పేర్కొన్నారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు.