ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సోమవారమే!

తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 8- 10 తేదీల మధ్య వెలువడుతుందని సమాచారం. సోమవారమే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఎన్నికల సంఘం శుక్రవారం భేటీ అయింది. 

అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల్లో సమీక్షలు నిర్వహించిన ఇసి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇటీవల మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే.  తెలంగాణతో పాటుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలలోఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఇసి భావిస్తోంది. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమయిన చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని భావిస్తోంది. 

పోలింగ్ ప్రక్రియ నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. కాగా డిసెంబర్ 10-15తేదీల మధ్య ఓట్ల లెక్కింపు జరపాలని ఇసి భావిస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో ముగియనుండగా, మిజోరీం శాసన సభ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగుస్తుంది. 

మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉండగా, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ, మధ్యప్రదేశ్‌లో బిజెపి అధికారంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) అధికారంలో ఉంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో శుక్రవారం సమావేశం నిర్వహించింది. ఈ అయిదు రాష్ట్రాల కోసం ఎన్నికల సంఘం 1100 మందికి పైగా పరిశీలకులను నియమించనుంది. 

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రలోభ రహిత ఎన్నికలను నిర్వహించేందుకు సమన్వయంలో పని చేయాలని, తద్వారా అందరికీ సమాన అవకాశాల వేదికను కల్పించాలని సిఇసి రాజీవ్ కుమార్ పరిశీలకులను ఆదేశించారు. ఎన్నికల పరిశీలకులు తమ విధుల విషయంలో తటస్థంగా, నైతికంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో ధనబలాన్ని పూర్తిగా కట్టడి చేయాలని రాజీవ్ కుమార్ పరిశీలకులను ఆదేశించారు. 

దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన వయో వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించడం ద్వారా, అలాగే మారుమూల ప్రాంతాల గిరిజనులకు వారికి అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం లాంటి సదుపాయాలు కల్పించడం ద్వారా ఎన్నికల కమిషన్ మానవతా దృక్పథంతో వ్యవహరించడంపై దృష్టిపెడుతోందని కూడా ఆయన చెప్పారు.