వాతావ‌ర‌ణ మార్పుల‌పై మేల్కొనాల‌ని పోప్ ఫ్రాన్సిస్ పిలుపు

ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌తో ప్ర‌పంచం కుప్ప‌కూలుతున్న‌ద‌ని రానున్న సంక్షోభాన్ని త‌ప్పించేందుకు మార్పుల‌కు సిద్ధం కావాల‌ని వాతావ‌ర‌ణ మార్పులను నిరాక‌రించేవారికి, రాజ‌కీయ నేత‌ల‌కు పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇటీవ‌ల కొన్నేండ్లుగా అధిక ఉష్ణోగ్ర‌త‌లు, క‌రువు వంటి అసాధార‌ణ వాతావ‌ర‌ణ పరిస్ధితులు ఏ ఒక్క‌రూ నిరాక‌రించ‌లేని వాస్త‌వమ‌ని పేర్కొన్నారు.
ప్రపంచంలోని అత్యంత నిరుపేదలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వారు ఇప్పటికే ఈ వాతావరణ మార్పులకు అధిక మూల్యం చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. మానవాళికి, భూగోళానికి ఇప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కలిగిన నష్టాన్ని మనమెలాగూ పూడ్చలేం, కనీసం మరింత నష్టం వాటిల్లకుండా నిలువరించేందుకన్నా మనం ప్రయత్నించాల్సి వుందని పేర్కొన్నారు.
ప్రధానంగా అమెరికాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో తలసరి కాలుష్య ఉద్గారాల విడుదల చైనాతో పోలిస్తే రెట్టింపుగా వుందని తెలిపారు. అదే పేద దేశాల సగటుతో పోల్చుకుంటే ఏడు రెట్లు ఎక్కువగా వుందని చెప్పారు. వ్యక్తిగత, కుటుంబాల స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు కొంతమేరకు దోహదపడుతున్నప్పటికీ, సుదీర్ఘకాలంలో గణనీయమైన ప్రభావాన్ని చూపగలిగే, పశ్చిమ దేశాల నమూనాతో ముడిపడిన బాధ్యతారాహిత్యమైన జీవనశైలిలో విస్తృతమైన మార్పులు తీసుకురావాల్సి వుందని స్పష్టం చేశారు.

కొన్ని దేశాల, వ్యాపారుల‌, రాజ‌కీయ శ‌క్తుల స్వ‌ల్ప‌కాలిక ప్ర‌యోజ‌నాల‌ను విరమించుకుని ఉన్న‌త రాజ‌కీయ విలువ‌ల‌తో స‌రైన స‌మ‌యంలో స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించాల‌ని పోప్ ఫ్రాన్సిస్ కోరారు. దుబాయ్‌లో వ‌చ్చే నెల‌లో కాప్‌28 స‌ద‌స్సు జ‌ర‌గ‌నున్న నేప‌ధ్యంలో పోప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  శుద్ధ‌, పున‌రుత్పాద‌క ఇంధ‌నాల‌కు మ‌ళ్ల‌డం మంద‌కొడిగా సాగుతూ ఫాసిల్ ఫ్యూయ‌ల్స్ వాడ‌కం కొన‌సాగుతుండ‌టం ప‌ట్ల పోప్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌నం నివ‌సిస్తున్న ప్ర‌పంచం కుప్ప‌కూలుతోంది, మ‌నం బ్రేకింగ్ పాయింట్ ద‌గ్గ‌ర ఉన్నామ‌ని వ్యాఖ్యానించారు.

వాతావరణ మార్పుల ప్రభావం ప‌లువురు వ్యక్తుల జీవితాలను, కుటుంబాలను దెబ్బతీస్తుందనేది నిస్సందేహమ‌ని ప్రైజ్ గాడ్ అనే త‌న తాజా డాక్యుమెంట్‌లో పోప్ పేర్కొన్నారు. 2015లో ప‌ర్యావ‌ర‌ణంపై త‌న ఎన్‌సైక్లికల్‌కు కొన‌సాగింపుగా పోప్ 7000 వ‌ర్డ్ డాక్యుమెంట్‌లో ఈ విష‌యాలు ప్ర‌స్తావించారు.  వాతావర‌ణంలో చోటుచేసుకుంటున్న అత్యంత అసాధార‌ణ మార్పులను భూమండ‌లం యొక్క‌ నిర‌స‌న ఆక్రంద‌న‌లుగా పోప్ అభివ‌ర్ణించారు. ఈ సమస్యను తిరస్కరించడానికి, తగ్గించడానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగినా, వాతావరణ మార్పు సంకేతాలు స్ప‌ష్టంగా కనిపిస్తున్నాయని పోప్ నొక్కిచెప్పారు.