41 మంది కెనడా దౌత్యవేత్తలకు దేశం వదిలి వెళ్ళమని ఆదేశం

భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. అక్టోబర్ 10వ తేదీ లోగా భారత్‌లోని దాదాపు 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాను భారత ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. గడువులోగా వెనక్కు దేశాన్ని వీడని పక్షంలో వారి దౌత్యపరమైన చట్టబద్ధతను రద్దు చేయవలసి వస్తుందని భారత్ హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.
దీంతో అక్టోబరు 10లోగా సుమారు 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలని భారత్‌ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.  కెనడాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే న్యూఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ సంఖ్యను సమస్థాయికి తీసుకురావాలని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా ఓ కథనంలో పేర్కొంది.
ప్రస్తుతం భారత్‌లో 62 మంది కెనడా దౌత్యవేత్తలు ఉన్నారు. ఈ సంఖ్యను 21కి తగ్గించాలని భారత్ భావిస్తోంది. ఇతర దేశాలతో సమానంగా దౌత్య సిబ్బంది సంఖ్యను నిర్వహించాలని భారత్ భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌ 10 దాటిన తర్వాత అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను కూడా  తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారంపై కెనడా, భారత్‌ విదేశాంగ శాఖలు స్పందించాల్సి వుంది.

జూన్ 18న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం ఈ హత్య వెనుక భారత్ ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఆరోపణలను పురస్కరించుకుని తమ దేశంలోని భారత దౌత్యవేత్త ఒకరిని కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ దేశం నుంచి బహిష్కరించారు. దీని ప్రతీకారంగా భారత్ కూడా తమ దేశంలోని కెనడా దౌత్యవేత్త ఒకరిని దేశం నుంచి బహిష్కరించింది.