ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఏడుగురు నక్సలైట్లు హతమయ్యారు.  నారాయణపూర్, బీజాపుర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.  ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో నక్సలైట్ల మృతదేహాలతోపాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

“వివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతుండగా ఉదయం 11 గంటలకు కాల్పులు మొదలయ్యాయి. మావోయిస్టు యూనిఫాంలో ఉన్న ఏడుగురు నక్సలైట్లు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఏడు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయి” అని గురువారం సాయంత్రం నారాయణ్పుర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు.

ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా అధికారులకు సమాచారం అందింది. దంతెవాడ, నారాయణ్పుర్, బస్తర్ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సభ్యులు, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు కలిసి గురువారం గాలింపు చర్యలు చేపట్టారు.

 ఉదయం 11 గంటల సమయంలో ఇరు వర్గాలు పరస్పరం ఎదురుపడడం కాల్పులకు దారితీసింది. ఐదు గంటల పాటు సాగిన ఈ భీకర పోరులో ఏడుగురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో కలిపి ఛత్తీస్గఢ్లో ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 112 మంది నక్సలైట్లు మరణించారు. 

ఏప్రిల్ 30న నారాయణ్పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఇదే తరహాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నాటి ఘటనలో ముగ్గురు మహిళలు సహా మొత్తం 10 మంది నక్సలైట్లు భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది నక్సలైట్లు హతం అయ్యారు. 

మే 10న బిజాపుర్ జిల్లాలోని పిడియా గ్రామానికి సమీపంలోనూ ఇదే తరహాలో భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఎన్కౌంటర్లో 12 మంది నక్సల్స్ చనిపోయారు.