న్యూయార్క్‌ నగరాన్ని ముంచెత్తిన వరదలు

అమెరికాలోని న్యూయార్క్ లో శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. వరద కారణంగా రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సబ్ వేలలోకి వరద నీరు చేరడంతో అధికారులు అన్ని రైళ్లను రద్దు చేశారు.  న్యూయార్క్ విమానాశ్రయంలోకి కూడా వరద చేరింది. దీంతో ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేసి, విమానాలను మళ్లించారు.

శనివారం కూడా వర్షం కురుస్తుండడంతో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షం, వరదలకు సంబంధించి జాతీయ వాతావరణ శాఖ న్యూయార్క్ వాసులకు హెచ్చరికలు జారీ చేసింది.  కుండపోత వర్షాల నేపథ్యంలో ఇళ్లల్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.  మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున వరద ముప్పు నేపథ్యంలో నగరంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. 

ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని నగర ప్రజలకు సూచించారు. బ్రూక్లిన్ సహా పలు సబ్ వే స్టేషన్లు నీట మునిగాయని, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ నిలిచిపోయిందని తెలిపారు. న్యూయార్క్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతంలోని వరద పరిస్థితిని వీడియోల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోని దుకాణాల్లోకి వరద నీరు చేరింది. ‘మీరు ఇళ్లల్లో ఉంటే ఇళ్లల్లోనే ఉండండి. ఆఫీస్ ల్లో ఉంటే సురక్షితమైన షెల్టర్ చూసుకోండి. కొన్ని సబ్ వేస్ వరద నీటిలో మునిగాయి. ప్రస్తుతం నగరంలో ప్రయాణాలు అంత సురక్షితం కాదు’ అని మేయర్ ట్వీట్ చేశారు. 

న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ జూ లో కి కూడా భారీగా వరద నీరు చేరింది. న్యూయార్క్ లో సుమారు 85 లక్షల మంది పౌరులు ఉంటారు. న్యూయార్క్ లో ప్రపంచంలోెనే అతిపెద్ద సబ్ వే సిస్టమ్ ఉంది. ఈ వరదలతో అందులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా, రెండేళ్ల కిందట కూడా సెప్టెంబర్ నెలలోనే అమెరికాలో వరదలు బీభత్సం సృష్టించాయి. బ్రూక్లిన్, క్వీన్స్ రాష్ట్రాల్లో వరదల కారణంగా గతేడాది 13 మంది చనిపోయారు.