తిరుమలలో వైభవంగా మలయప్ప రథోత్సవం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం 6.55 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. 
 
శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. 
ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది.
తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైంది. ”రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే” అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. 
 
తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.  కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం ఆదివారం సాయంత్రం తిరుమలలో ఘనంగా జరిగింది. 
 
సోమ‌వారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు. ఇందుకోసం ప్రధాన కల్యాణకట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ ఛైర్మ‌న్భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అప్పగించారు.
 
తిరుమలలో మొట్టమొదటి కళ్యాణ కట్టను ఏర్పాటుచేసి యాత్రికులకు తలనీలాలు సమర్పించుకునే వసతి కల్పించిన పంతులు గారి వంశస్థులు వంశపారంపర్యంగా శ్రీవారి రథానికి గొడుగు సమర్పించ‌డం ఎంతో కాలంగా ఆచారంగా వ‌స్తోంద‌న్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రారంభమైన ఈ ఆచారం ఆ తర్వాత మహంతుల పాలనలో కూడా కొనసాగిందని చెప్పారు.