అమిత్ షా సమక్షంలో ఎన్డీయేలో చేరిన జేడీఎస్

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)లో జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) శుక్రవారంనాడు లాంఛనంగా చేరింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను, జనతాదళ్ నేత, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో కలుసుకున్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు.
 
ఈ తాజా పరిణామంతో కర్ణాటకలో భాజపా, జేడీఎస్‌ మధ్య పొత్తు పొడుపులపై గత కొన్నాళ్లుగా వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. ఈ చేరికపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్‌ చేస్తూ అమిత్‌ షా సమక్షంలో హెచ్‌డీ కుమారస్వామితో సమావేశమయ్యారని తెలిపారు.  జేడీఎస్‌ ఎన్డీయేలో భాగస్వామి కావాలని నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని నడ్డా పేర్కొన్నారు. జేడీఎస్‌ను హృదయపూర్వకంగా తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ఎన్డీయేను, ప్రధాని నరేంద్ర మోదీ ‘న్యూ ఇండియా, స్ట్రాంగ్‌ ఇండియా’ విజన్‌ను బలోపేతం చేస్తుందని నడ్డా ట్వీట్‌లో ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదరనుందంటూ కొద్దికాలంగా సంకేతాలు వెలువడుతున్నాయి. పొత్తులో భాగంగా కర్ణాటకలో 4 లోక్‌సభ స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనుందనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి గురువారంనాడు పార్లమెంటులో అమిత్‌షాను కలుసుకున్నారు.

 కర్ణాటక రాజకీయ పరిణాలపై కొద్దికాలంగా వీరి మధ్య మంతనాలు జరుగుతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు నడిచింది. అయితే బీజేపీ 28 సీట్లలో 25 సీట్లు ఎగరేసుకుపోయింది. బీజేపీ హవా నడవడంతో ఆ పార్టీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి కూడా మాండ్య నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

 జేడీఎస్ ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కేవలం 19 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని పార్టీ చరిత్రలోనే అత్యంత దయనీయ ఫలితాలను చవిచూసింది.  కాగా, ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్‌డీఏ సమావేశానికి జేడీఎస్‌కు ఎలాంటి ఆహ్వానం పంపలేదు. అటు విపక్ష ‘ఇండియా’ బ్లాక్ సైతం బెంగళూరులో జూలైలో జరిగిన సమావేశానికి జేడీఎస్‌ను ఆహ్వానించ లేదు. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో చెలిమికి జేడీఎస్ మరోసారి మొగ్గుచూపింది.

అమిత్ షాతో భేటీ తర్వాత మాట్లాడిన హెచ్‌డీ కుమారస్వామి  ఎన్డీఏతో పొత్తు కుదిరినట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి ఎన్డీఏలో చేరడం గురించి మాట్లాడామని, సీట్ల పంపకంపై తర్వాత చర్చిస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంది. 
 
ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ, జేడీఎస్ కలవడం ఆ రాష్ట్రంలో మరింత రాజకీయ వేడిని కలిగించింది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 66 సీట్లు, జేడీఎస్‌కు 19 సీట్లు ఉన్నాయి. అయితే కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్, జేడీఎస్, స్వతంత్రులు ఒక్కో స్థానంలో గెలుపొందాయి.