తీవ్రంగా ప్రజాభిమానం కోల్పోతున్న కెనడా ప్రధాని ట్రూడో

 
* తండ్రి బాటలో ఖలిస్థాన్ ఉగ్రవాదంకు బాసటగా ట్రూడో
 
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు తాజాగా గట్టి షాక్‌ తగిలింది. దేశంలో ప్రధానిగా ఆయన పాపులారిటీ క్రమంగా తగ్గుతుంది. కెనడియన్స్‌ ఎక్కువమంది ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ నేత పియరీ పోయిలీవర్‌ వైపే మొగ్గుచూపుతున్నారు.
 
ప్రధానిగా 40 శాతం మంది ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నారు. కెనడాకు చెందిన గ్లోబల్‌ న్యూస్‌ అనే సంస్థ నిర్వహించిన పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. ఏడాది క్రితం నిర్వహించిన సర్వేతో పోలిస్తే ప్రధానిగా పియరీ పాపులారిటీ ఐదు శాతం పెరగడం విశేషం. ఇక ట్రూడో పాపులారిటీ మాత్రం నిలకడగా 31 శాతం వద్దే స్థిరపడింది.
 
కెనడాలో 2025లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ నేత పియరీకి 39 శాతం ఓట్లు వస్తాయని పోల్స్‌లో తేలింది. ఇక లిబరల్‌పార్టీకి నాయకత్వం వహిస్తున్న ప్రస్తుత ప్రధాని ట్రూడో 30 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని గ్లోబల్‌ న్యూస్‌ నివేదించింది.
 
అదే సమయంలో ట్రూడోకు మద్దతు తెలుపుతున్న న్యూ డెమొక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ ప్రజాదరణ సైతం మసకబారుతోంది. ఏడాది క్రితంతో పోలిస్తే నాలుగు శాతం తగ్గింది. ఏడాది క్రితం ఆయనకు మద్దతు తెలుపుతున్న వారు 26 శాతం కాగా, ఆ సంఖ్య ఇప్పుడు 22 శాతానికి పడిపోయింది. 
 
అన్నింటి కంటే ముఖ్యంగా దాదాపు 60 శాతం మంది కెనడియన్స్‌ ట్రూడో పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నట్లు ఈ పోల్స్‌లో తేలింది. అదేవిధంగా 50 ఏళ్లలో ట్రూడో అత్యంత చెత్త ప్రధానమంత్రిగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. సీటీవీ న్యూస్‌ ప్రకారం ట్రూడో తండ్రి పియరీ ట్రూడో 1968- 1979, 1980- 1984 వరకు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
 
కెనడా – భారత్ ల మధ్య చిచ్చు పెడుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదం పట్ల ట్రూడో మెతకగా వ్యవహరిస్తుండటాన్ని ఆ దేశ ప్రజలు సహితం ఆమోదింపలేక పోతున్నారని ఈ సర్వేలు వెల్లడి చేస్తున్నాయి. అయితే వారి ఉగ్రవాద కార్యకలాపాలను `భావప్రకటనా స్వేచ్ఛ’ అంటూ ట్రూడో పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం అవుతుంది. 
 
ఇటీవల జి20 సదస్సు  సందర్భంగా భారత్ పర్యటనకు వచ్చిన ట్రూడోతో కెనడాలో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం గల బృందాలు `భారత్ వ్యతిరేక కార్యకలాపాలు’ కెనడాలో కొనసాగుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. ఆ తర్వాతనే కెనడా పార్లమెంట్ లో నిజ్జార్‌ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నట్లు ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు విఘాతం కలిగిస్తున్నాయి.
 
ట్రూడో తండ్రి హయాంలో సహితం ద్వైపాక్షిక సంబంధాలలో చిచ్చు
 
కాగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ఇలియట్ ట్రూడో కూడా ఆ దేశ 15వ ప్రధానిగా ఉన్నసమయంలో కూడా భారత్‌, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఖలిస్థానీ అంశంపై మాత్రం కాకుండా అణు ఒప్పందంలో చిచ్చురేగింది. భారత్‌ పౌర అణు శక్తి కార్యక్రమానికి అమెరికా, కెనడా సహకరించాయి.
 
 కెనడాతో కలిసి నిర్మించిన కెనడా డ్యూటెరియం యురేనియం రియాక్టర్, అణు విద్యుత్‌ ఉత్పత్తి కోసం యురేనియం వినియోగాన్ని అనుమతించింది. మరోవైపు 1971లో పియరీ ట్రూడో జరిపిన భారత్ పర్యటన తర్వాత మూడేళ్లకు 1974లో పోఖ్రాన్‌లో అణ్వాయుధాన్ని భారత్‌ పరీక్షించింది. 
 
కెనడాతో కలిసి నిర్మించిన రియాక్టర్‌లోని ప్లూటోనియంను దీని కోసం వినియోగించినట్లు అమెరికా, కెనడా ఆరోపించాయి. సంబంధిత ఒప్పందాలను భారత్‌ ఉల్లంఘించినట్లు కెనడా మండిపడింది. శాంతియుత అణు పరీక్షగా పేర్కొన్న భారత్ వాదలను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో భారత అణుశక్తి కార్యక్రమానికి మద్దతును పియరీ ట్రూడో నేతృతంలోని కెనడా ప్రభుత్వం ఉపసంహరించింది. 
 
అలాగే భారత్‌లోని మరో రియాక్టర్‌ వద్ద పనిచేస్తున్న కెనడియన్ అధికారులను వెనక్కి రప్పించింది. అయితే 2010లో జీ 20 సమ్మిట్ కోసం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కెనడా పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య అణు సహకార ఒప్పందం మళ్లీ కుదిరింది. కాగా, ఖలిస్థానీ అనుబంధ సంస్థ బబ్బర్ ఖల్సా సభ్యుడు పర్మార్‌కు నాటి కెనడా ప్రధాని, జస్టిన్ ట్రూడో తండ్రి పియర్ ట్రూడో మద్దతిచ్చారు. విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలపై దాడులకు పిలుపునిచ్చిన పర్మార్‌ను అప్పగించాలని భారత్‌ చేసిన అభ్యర్థనను ఆయన ప్రభుత్వం తిరస్కరించింది. భారత్ పంపిన ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 1985 జూన్ 23న కెనడాలోని టొరంటో నుంచి బ్రిటన్‌ రాజధాని లండన్‌కు ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం 182 (కనిష్క)లో రెండు సూట్‌ కేసులలో బాంబులు అమర్చారు.  ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు వాటిని పేల్చడంతో ఆ విమానంలో ఉన్న 329 మంది ప్రయాణికులు మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది కెనడియన్లే. కనిష్క బాంబు దాడి కెనడా చరిత్రలో అత్యంత భయంకరమైన ఉగ్రవాద దాడిగా మిగిలిపోయింది.

మరోవైపు కనిష్క బాంబు దాడి సూత్రధారి, పియరీ ట్రూడో మద్దతిచ్చిన పర్మార్, 1992లో పంజాబ్‌ పోలీసుల చేతిలో హతమయ్యాడు. అయితే ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని పలు ప్రాంతాల్లో పర్మార్‌ను గౌరవిస్తూ పోస్టర్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్‌ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తన తండ్రి పియరీ ట్రూడో బాటను అనుసరిస్తున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి.