నేడు ఏపీ సిఐడి కస్టడీకి చంద్రబాబు నాయుడు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇవాళ ఏపీ సిఐడి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తుంది. శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన అనుమతితో ఆయనను 2 రోజులు ప్రశ్నించేందుకు సిఐడి సిద్ధమైంది. ఈ విచారణ మొత్తం రాజమండ్రి సెంట్రల్ జైలులోనే జరగనుంది. 

ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రశ్నిస్తారు. మధ్యలో ఓ గంట భోజనం కోసం గ్యాప్ ఇస్తారు. ఇలా శని, ఆదివారం ప్రశ్నిస్తారు. ఈ విచారణ డిఐజి స్థాయి అధికారి పర్యవేక్షణలో ఇది జరుగుతుందని చెబుతున్నారు. ఈ విచారణ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఓ గదిని సిద్ధం చేశారు. సిఐడి తరపున 12 మంది విచారణలో పాల్గొనేందుకు ఎసిబి కోర్టు అనుమతించింది.

వారిలో తొమ్మిది మంది విచారణ అధికారులు, ఇద్దరు మధ్యవర్తులు, ఒక వీడియో గ్రాఫర్ ఉంటారని పేర్కొంది. చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు -గింజుపల్లి సుబ్బారావు, దొమ్మాలపాటి శ్రీనివాస్ పాల్గొనడానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.  విచారణ మొత్తాన్నీ వీడియో తీసి, ఏసీబీ కోర్టుకు సమర్పిస్తారు. ఈ సిఐడి విచారణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఏవీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ ప్రశ్నలు అడిగారో కూడా బయటకు చెప్పరు. 

 స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.371 కోట్లు ఏమయ్యాయి? ఎటు మళ్లాయి? అనే అంశాల చుట్టూ ఈ విచారణ సాగనుంది. ఈ విచారణ సమయంలో జైలు ఉన్నతాధికారులను కూడా అక్కడికి వెళ్లేందుకు అనుమతించరు. ఇందుకోసం 30 ప్రశ్నలను సిద్ధం చేసుకున్న సిఐడి వాటికి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో బాబుపై 34 అభియోగాలు మోపిన సీఐడీ తప్పుడు పత్రాలు సృష్టించటం, నిధులు మళ్లింపు, సిమన్స్ ఒప్పందం, జారీ చేసిన జీవోతో పాటుగా, డాక్యుమెంట్స్, ఫోర్జరీ, 13 నోట్ ఫైల్స్‌పై బాబు సంతకాలు, ఐటీని లెక్కచెయ్యకపోవటం, షెల్ కంపెనీలు, అధికారులపై ఒత్తిడి లాంటి కీలక అంశాలపై ప్రశ్నలు సంధించనున్నట్లు తెలుస్తోంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లేకపోవడంపై సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నిధుల విడుదలపై ఫైనాన్స్ శాఖ అధికారులు వద్దన్నా చంద్రబాబు ఎందుకు వందల కోట్లు విడుదల చేయించారనే విషయంపై సీఐడీ ప్రశ్నలు సిద్ధం చేసిందని సమాచారం. చంద్రబాబుకి రిమాండ్‌ని ఏసీబీ కోర్టు మరో రెండ్రోజులు పొడిగించడంతో ఆదివారం వరకూ రిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి చంద్రబాబుతో మాడ్లాడతారు. రిమాండ్ పొడిగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.

ఇక చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు తరపు లాయర్లు ఇవాళ సుప్రీంకోర్టు మెట్లెక్కే అవకాశాలు ఉన్నాయి. అందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అటు చంద్రబాబు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను కోర్టు సోమవారం విచారించనుంది.  అలాగే చంద్రబాబుపై అమరావతి రాజధాని రింగ్ రోడ్డు స్కాం కేసు, ఫైబర్ నెట్ స్కాం కేసుల్లో సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్లపై కూడా సోమవారమే విచారణ జరగనుంది.