ఎల్‌ఐసీ ఏజెంట్ల సంక్షేమానికి కేంద్రం ఆమోదముద్ర

ఎల్‌ఐసీ ఏజెంట్ల సంక్షేమానికి సంబంధించి పలు అంశాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఎల్‌ఐసీ ఏజెంట్లు దశాబ్దాలుగా కోరుతున్న గ్రాట్యుటీ పరిమితి పెంపు, పునరుద్ధరణ కమీషన్‌కు అర్హత, టర్మ్ ఇన్సురెన్స్, ఎల్‌ఐసీ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్ వంటి నిర్ణయాలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

ఎల్ఐసీ ఏజెంట్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే విధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

1. ఎల్‌ఐసీ ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఇది ఎల్‌ఐసీ ఏజెంట్ల జీవన స్థితిగతులలో గణనీయమైన పెరుగుదలను తీసుకొస్తుంది.

2. తిరిగి నియమితులైన ఏజెంట్లు పునరుద్ధరణ కమీషన్‌కు అర్హులయ్యేలా చేయడం, తద్వారా వారికి  ఆర్థిక స్థిరత్వం కలగనుంది. ప్రస్తుతం ఎల్‌ఐసీ ఏజెంట్లు పాత ఏజెన్సీ కింద పూర్తి చేసిన ఏ వ్యాపారంపైనా పునరుద్ధరణ కమీషన్‌కు అర్హులు కాదు. జీవీఎల్ వినతిపై కేంద్రప్రభుత్వం దీన్ని మార్చింది.

3. ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 3,000-10,000 రూపాయల నుండి రూ. 25,000-1,50,000కి పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు బీమా గణనీయంగా పెరగనుంది.

4. ఎల్‌ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం ఒకేరకమైన రేటుతో కుటుంబ పెన్షన్ అందివ్వనున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఎల్‌ఐసీ వృద్ధిలో, భారతదేశంలో బీమా వ్యాప్తిని మరింతగా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న13 లక్షలకు పైగా ఏజెంట్లు, లక్ష కంటే ఎక్కువ మంది రెగ్యులర్ ఉద్యోగులు ఈ సంక్షేమ చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారు.