దసరా నుంచే విశాఖ నుండి పరిపాలన

దసరా నుంచే విశాఖ నుండి పరిపాలన చేస్తామన, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుకెడుతూ జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసిపి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించారు. బుధవారం జరిగిన కేబినెట్‌  ఇందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. 
 
విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర భవనాల ఎంపిక విషయంలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల తరలింపు ఉంటుందని సిఎం చెప్పారు. 
 
మరోవైపు జమిలీ ఎన్నికలపై సిఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుకు వెళతామని ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు వైసిపి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలని, ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని నిర్ణయించారు. 
 
రిటైర్డ్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలని, వారి పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలని నిర్ణయించారు.  జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
 
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎపి వైద్య విధాన పరిషత్‌ సవరణ బిల్లును ఆమోదించింది. ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్‌ ఉండేలా చట్ట సవరణ చేసింది. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వనుంది. 
ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్‌ 100 యూనివర్శిటీలతో టై అప్‌ ఉండేలా చట్ట సవరణ చేపట్టాలని, దీనివల్ల జాయింట్‌ సర్టిఫికేషన్‌కు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.  ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలోకి వస్తాయని, దీనివల్ల పిల్లలకు మేలు జరుగుతుందని కేబినెట్‌ అభిప్రాయపడింది.