అనంత్‌నాగ్‌లో కొనసాగుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌

జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యంచేపట్టిన ఆపరేషన్ ఆరో రోజున కూడా కొనసాగుతూనే ఉంది. కొండ ప్రాంతాల్లో నక్కిన ముష్కరులతో కొనసాగుతోన్న ఎన్‌కౌంటర్ 120 గంటలు దాడినా ఇంకా పూర్తి కాలేదు. 
 
ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ శత్రువులు యుద్ధమే కోరుకుంటే , చివరికు వారి పిల్లలను వేరే వాళ్లు పెంచాల్సి వస్తుందంటూ ఘాటుగా పేర్కొన్నారు. ‘ భారత్‌కు శత్రువులు ఉన్నారు. వారు దేశ పురోగతిని అడ్డుకోవాలని కోరుకుంటున్నారు. అయితే వారు తెలుసుకోవాల్సింది ఒక్కటే. మా సైన్యం అత్యాధునికి సాంకేతికత , అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను కలిగి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అంటూ హెచ్చరించారు. 
 
`ఇది సరికొత్త భారత్. బెదిరింపులకు భయపడదు. వెనక్కి తగ్గదు. ఇప్పటికే యుద్ధాలను చూసిన భారత్ .. వాటిని కోరుకోవడం లేదు. కానీ ఎవరైనా యుద్ధాన్నే కోరుకుంటే , వాళ్ల పిల్లల్ని ఇతరులు పెంచాల్సి వస్తుంది’ అంటూ తేల్చి చెప్పారు.

అనంత్‌నాగ్‌ కోకెర్‌నాగ్‌ అటవీ ప్రాంతంలోని రహస్యప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని, పదికిపైగా బృందాలు మోహరించినట్లు జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు. అటవీ ప్రాంతం దట్టంగా ఉండడంతో కాస్త ఇబ్బంది ఎదురవుతుందని, రిస్క్‌ ఎక్కువగా ఉన్న చోట కొన్ని ఆపరేషన్లు ఉంటాయని, ఈ సమయంలో నష్టం జరిగే అవకాశాలుంటాయని చెప్పారు. 
 
అయినా ధైర్యంతో బలగాలు ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు. అయితే, ఇది వ్యూహాత్మక తప్పిదానికి సంబంధించిన విషయం కాదని పేర్కొన్నారు.  ఉగ్రవాదులు గెరిల్లా యుద్ధ వ్యూహాలను అవలంభిస్తూ పర్వతాలు, అడవులు, గుహలాంటి ప్రదేశాలను వినియోగించుకుంటూ భద్రతా బలగాలకు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. 
 
ఇందుకోసం వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన ధైర్యవంతులైన ఆఫీసర్స్‌కు సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు.  ఆపరేషన్‌ నిర్వహిస్తున్న ప్రాంతంలో చాలా కఠినమైన ప్రాంతమని పేర్కొంటూ  ఎత్తైన ప్రదేశం కావడంతో పాటు దట్టంగా అటవీ ఉందని, అందులో రహస్య స్థావరం ఉందని,  ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నారని వివరించారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతుందని చెప్పారు. 
 
ఈ నెల 13న ఉగ్రవాదుల దాడిలో ఆర్మీ అధికారులతో పాటు పోలీస్‌ డీఎస్పీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన సెర్చ్‌ ఆపరేషన్‌లో మరో సైనికుడు సైతం వీరమరణం పొందాడు. అప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు నిరంతరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. డ్రోన్లతో గ్రెనేడ్లతో దాడులు నిర్వహించింది.