భూ ఎలక్ట్రాన్స్‌తోనే చంద్ర మండలంపై నీరు

భూ ఎలక్ట్రాన్స్‌తోనే చంద్ర మండలంపై నీరు

భారతదేశపు చంద్రయాన్ 1 పరీక్ష దశలో సేకరించిన చంద్రుడి రిమోట్ సెన్సింగ్ డేటా అమెరికా పరిశోధకులు, సైంటిస్టులకు కీలక సమాచారాన్ని అందించింది. చంద్రుడిపై నీటి పుట్టుకకు భూ వాతావరణంలో ఉండే అత్యంత గాఢమైన సాంద్రతతో కూడిన ఎలక్ట్రాన్స్ కారణమని మనోవాలోని హవాయ్ యూనివర్శిటీ (యుహెచ్)కు చెందిన పరిశోధకుల బృందం కనుగొంది. 

చంద్రుడిపై జలరాశి ఆవిర్భావానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదు. తొలిసారి భూ ఎలక్ట్రాన్స్‌తోనే చంద్ర మండలంపై నీరు పుట్టిందని పరిశోధకులు తేల్చిన విషయాన్ని ఇప్పుడు ఖగోళ శాస్త్ర సంబంధిత జర్నల్ నేచర్ ఆస్ట్రానమిలో వెల్లడించారు. 2008 అక్టోబర్‌లో చంద్రయాన్ 1ను ఇస్రో చేపట్టింది. ఇది ఏడాది పాటు రోవర్ , ఇంపాక్టర్‌లతో జాబిల్లిపై తన పరిశోధనలు సాగించింది.

ఈ క్రమంలోనే అక్కడ నీటి ఉనికిని కనుగొన్నారు. భూ వాతావరణంలో ఉండే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రాన్స్ ప్లాస్మాలతో పలు రకాలైన వాతావరణ ప్రక్రియలు జరుగుతుంటాయి. చంద్రుడి ఉపరితలంపై ఉన్న అపార ఖనిజాలను శిలలను కరిగించడం లేదా విచ్ఛిన్నం చేయడానికి ఈ ఆమ్ల ధర్మాలున్న ఎలక్ట్రాన్ అణువులు పాల్పడి ఉంటాయని పరిశోధకులు నిర్ధారించారు. 

ఇదే కాకుండా చంద్రుడిపై నీటి ఆవిర్భావానికి కూడా ఇవే దారితీసి ఉంటాయని వెల్లడైంది. చంద్రుడిపై జలం నిల్వలు, ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయనేది ముందు నిర్థారించుకోవల్సి ఉంటుంది. దీని వల్లనే జల అవతరణ, దీని పరిణామ క్రమం ఇకపై చంద్రుడి వద్ద మనిషి ఉండేందుకు అనువైన పరిస్థితి ఉంటుందా? అనే విషయాలను తెలుసుకోవచ్చు. 

ఇక సౌరగాలులలో ఉండే అత్యంత శక్తివంతమైన పోట్రాన్లు వంటి కణాలతు తరచూ చంద్రుడి ఉపరితలంపై దూసుకువెళ్లడం కూడా అక్కడ జలం ఏర్పాటుకు దారితీసిన కారణాలలో ఒక్కటై ఉంటుంది. భూ అయస్కాంత క్షేత్రం పరిధిలో నుంచి చంద్రుడి ప్రయాణం జరిగినప్పుడు ఏం జరుగుతుందనేది కీలకం అయింది. 

ఈ దశలో చంద్రుడు పూర్తిగా సౌర గాలుల ప్రభావం నుంచి తప్పించుకుంటాడు, కానీ ఈ దశలోనూ సూర్యకాంతిలోని కణాలు ఫోటాన్స్ ప్రభావం ఉండనే ఉంటుంది. భూ అయస్కాంత క్షక్షలో నుంచి చంద్రుడు వెళ్లుతున్న దశలో ఏదో ఒక కీలక మార్పు ప్రక్రియ చంద్రుడిపై ఉంటుందని విశ్లేషించారు. చంద్రయాన్ 1 నుంచి అందిన డేటాతో తమకు మరిన్ని పరిశోధనలకు అవకాశం ఏర్పడిందని యుహెచ్ మనోవాకు చెందిన పరిశోధకులు షుయియి లి తెలిపారు.