ఓటు బ్యాంకు రాజకేయాలతోనే విమోచనదినంకు దూరం

గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు.  హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం కేంద్ర హోంమంత్రి ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. సాయుధ బలగాల కవాతును ఆయన పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు.
 
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ నిజాంకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నట్లు తెలిపారు. వారు దేశభక్తిని ప్రదర్శించారని, త్యాగాలకు వెనుకాడరని కొనియాడుతూ అయితే వీటిని సరిగ్గా ప్రస్తావించటం లేదని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం, అమరవీరుల త్యాగాలను భవిష్యత్ తరాలకు, యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
 
హైదరాబాద్‌ విముక్తిలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, కేఎం మున్షీ వంటి నాయకులు ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు.  సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి వచ్చేది కాదని స్పష్టం చేశారు.  తెలంగాణ చరిత్రను 75 ఏళ్ల పాటు వక్రీకరించారని చెబుతూ మోదీ ప్రధాని అయ్యాకే ఆ పొరపాటను సరిచేశారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ చరిత్రను చాటి చెబుతోందని, సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు షా తెలిపారు.
 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని బీజేపీ నేత ఆరోపించారు. “విముక్తి పోరాటంలో పాల్గొన్న యోధులకు వందనాలు. పటేల్ లేకపోతే తెలంగాణ విముక్తి సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు వందనాలు. నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనం” అని కొనియాడారు. 
 
ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట యోధుల పేర్లను ప్రస్తావించారు అమిత్ షా. ఉస్మానియాలో వందేమాతరం పేరుతో ఆందోళనలు జరిగాయని, తెలంగాణ ప్రాంతం రజాకార్ల అరాచకాలకు పరకాల సజీవ సాక్ష్యం గా నిలుస్తుందని చెప్పారు. పరకాలలో అనేక మంది అమరులయ్యారని పేర్కొన్నారు. ఈ ప్రాంత విముక్తి కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని, ‘ఆపరేషన్‌ పోలో’ పేరుతో నిజాం మెడలు పటేల్‌ వంచారని గుర్తు చేశారు.

తెలంగాణ విమోచన దినాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు అమిత్ షా. దేశ ప్రజలు వాళ్లను క్షమించరన్న ఆయన స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా కాంగ్రెస్ వక్రీకరించిందని దుయ్యబట్టారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన సాంస్కృతిక బృందాలు ప్రదర్శించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పాల్గొన్నారు. ఈ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా పలువురు స్వాతంత్య్ర పోరాట యోధులను సన్మానించారు అమిత్ షా. పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అమిత్‌షా పంపిణీ చేశారు.