ఉరి సెక్టార్‌లో లో ముగ్గురు తీవ్రవాదుల హతం

జ‌మ్మూక‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉన్న ఉరి సెక్టార్‌ ప్రాంతంలో శనివారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు తీవ్రవాదులు  మృతిచెందారు. నియంత్రణ రేఖ వ‌ద్ద ఉన్న హ‌త్లాంగ్ ఫార్వ‌ర్డ్ ఏరియాలో ఉగ్ర‌వాదుల‌కు, భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి.  ఆ ప్రాంతంలో మిలిటెంట్లు సంచ‌రిస్తున్న‌ట్లు ఇంటెలిజెన్స్ స‌మాచారం రావ‌డంతో భ‌ద్ర‌తా ద‌ళాలు ఆ ప్రాంతాన్ని చ‌ట్టుముట్టాయి.
సెర్చ్ ఆప‌రేష‌న్ స‌మ‌యంలో తీవ్ర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అనుమానిత లొకేష‌న్ వ‌ద్దకు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చేరుకున్న స‌మ‌యంలో మిలిటెంట్లు విచక్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపారు. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎదురుదాడికి దిగాయి.
 
మరోవంక, ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాలనే ఉద్దేశంతో అనంత్‌నాగ్‌ జిల్లాలోని కోకెర్‌నాగ్‌ ప్రాంతంలోని గాడోల్‌లోని అటవీ ప్రాంతంలో జమ్మూ – కాశ్మీర్‌ పోలీసులతోపాటు భారత సైన్యం వరుసగా నాలుగురోజుల నుంచి ఎన్‌కౌంటర్‌ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఓ కొండపైనున్న గుహలో నక్కిన ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతున్నారు. 
 
వారు నక్కిన ప్రాంతంలో ఓవైపు దట్టమైన అడవి, మరోవైపు కొండ ఉండడంతో ఏరివేత కష్టంగా ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కోకెరంగ్‌లోని గడుల్ అటవీ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, స్థానిక పోలీసులు మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు.  ఆ రోజు రాత్రి ఉగ్రవాదులతో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ రోజులు గుడుస్తున్నా కొనసాగుతూనే ఉంది.
ఈ క్రమంలో ఓ సైనికుడు గల్లంతవగా, ముగ్గురు అధికారులు అమరులయ్యారు. కొండపైన గుహలో ఉన్న ఉగ్రవాదులు కిందనున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు.  కొండను చుట్టుముట్టిన భద్రతా బలగాలు రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తున్నాయి. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో బాంబులు జార విడుస్తున్నాయి.
గుహలో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమంది ఉగ్రవాదులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులను భద్రతాదళాలు చుట్టుముట్టి, వారి పారిపోలేని పరిస్థితులు కల్పించాయని, వారి వద్ద ఉన్న మందుగుండు సామాగ్రి కూడా అయిపోతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. దానితో త్వరలో ఈ ఆపరేషన్ ముగియవచ్చని భావిస్తున్నారు.