తెలంగాణ కాంగ్రెస్ లో అగ్గి రాజేస్తున్న వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తుదివరకు పోరాడి, కాంగ్రెస్ అధిష్టానాన్ని కట్టడి చేసి, తాను జీవించి ఉన్నంత వరకు ఉమ్మడి రాష్ట్ర విభజన సాధ్యం కాకుండా అడ్డుకున్న దిగవంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ మరోసారి తెలంగాణా కాంగ్రెస్ లో ఆయన కుమార్తె కుమార్తె వైఎస్ షర్మిల రూపంలో అగ్గిరాజేస్తున్నది.

 
పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమెను పార్టీలో అసెంబ్లీ ఎన్నికల ముందు చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2018 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరిగిందని, షర్మిలను తెలంగాణ కాంగ్రెస్‌లో చేర్చుకోవడం వల్ల కూడా అలాంటి ప్రభావమే ఉంటుందని హెచ్చరించారు.
 
మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో షర్మిలను చేర్చుకోవద్దంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్థన్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఓ లేఖలో కోరారు. తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిలకు అవకాశం కల్పిస్తే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కేవలం రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా షర్మిలకు మద్దతు చెబుతున్నా వారు సహితం ఆందోళనకరంగానే ఉన్నారు.
 
అయితే, షర్మిల తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవ్వరిని లెక్కచేయకుండా నేరుగా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, తన తండ్రికి సన్నిహితుడైన కెవిపి రామచంద్రరావుల ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో సమాలోచనలు జరిపారు. నేరుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
 
 ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని ఆమెపై వత్తిడులు వస్తున్నాయి. అందుకు ఆమె సుముఖంగా లేరు. ముఖ్యంగా తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఖమ్మం జిల్లాలోని పాలేరు నుండి అసెంబ్లీకి పోటీచేయాలని ఆమె  ఉబలాటపడుతున్నారు.  అయితే ఆ సీటు పైననే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు కన్నేశారు.
అటువంటి వారిని కాదని ఆమెకు సీటు ఇచ్చినా ఆమె గెలుపొందే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయని అందరికి తెలుసు.  ఏపీలో ఎక్కడి నుండి పోటీ చేసినా గెలుస్తామన్న నమ్మకం ఆమెకు లేదు. అందుకనే కర్ణాటక నుండి రాజ్యసభకు పంపే ఏర్పాటు శివకుమార్ ద్వారా చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విబేధాలు రాజ్యసభ సీటు విషయంలోనే వచ్చాయని చెబుతున్నారు.
 
ఆమె 2014 నుండి లోక్ సభకు పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. కడప, ఒంగోలు, విశాఖపట్నం సీట్లలో ఒక సీటు కోరుకున్నారు. అయితే పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో వైఎస్ విజయమ్మను విశాఖపట్నం నుండి నిలబెట్టడం ద్వారా షర్మిలకు సీటు లేకుండా చేశారు. 2019 ఎన్నికలలో సహితం సీటు ఇవ్వకపోవడంతో రాజ్యసభకు వెళ్లాలనుకొన్నా ఫలించలేదు.
 
షర్మిల రాజకీయ ఎత్తుగడలు అన్నింటిని ఆమె భర్త బ్రదర్ అనిల్ నడిపిస్తున్నారని ప్రచారం ఉంది. అతనే చొరవ తీసుకొని, క్రైస్తవ మిషనరీల ద్వారా నేరుగా సోనియా గాంధీని ప్రభావితం చేసి, ఆమెను కాంగ్రెస్ లో నేర్చుకునేటట్లు చేశారని చెబుతున్నారు. జగన్ – షర్మిలల మధ్య దూరం పెరగడానికి కూడా అనిల్ కారణంగా పలువురు భావిస్తున్నారు.
 
తెలంగాణాలో సొంతంగా పార్టీ పెట్టుకొని, 3800 కి మీ మేరకు పాదయాత్ర జరిపినా రాజకీయంగా చెప్పుకోదగిన ప్రభావం చూపలేక పోవడంతో ఏదో ఒక పదవి కోసమే ఆమె కాంగ్రెస్ లో చేరుతున్నట్లు స్పష్టం అవుతుంది. ఫూపుల్స్ పల్స్ జరిపిన అధ్యనం ప్రకారం ఆమె పార్టీ ఎన్నికలలో పోటీచేస్తే 1 శాతంకు మించి ఓట్లు రావని తేలింది. చివరకు ఆమె పాలేరు నుండి పోటీచేసినా 3 శాతంకు మించి ఓట్లు రావని స్పష్టమైనది. అందుకోసమే కాంగ్రెస్ లో చేరి, ఎమ్యెల్యే కావాలని ప్రయత్నం చేశారు.
 
అయితే, ఆమె చేరితే కాంగ్రెస్ కొంప కొల్లేరు అవుతుందని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. పోటీ అటుంచి, తెలంగాణ అంతటా తనను ప్రచారం కోసం తిప్పాలని ఆమె కోరుకొంటున్నా అది మరింకా ప్రమాదకరం కాగలదని ఆందోళన చెందుతున్నారు. మరోవంక, ఏపీలో ఎంతగా ప్రచారం చేసినా ప్రయోజనం ఉండబోదని ఆమెకు తెలుసు.
 
ఏదేమైనా షర్మిల ప్రవేశం తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఇరకాటంలో పడవేస్తుంది. 2018లో టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పటి విషాద అనుభవాలను వారికి గుర్తుకు తెస్తుంది. అందుకు పార్టీ అధిష్టానం చొరవ తీసుకోవడం వారిని మరింతగా ఆందోళనకు గురిచేస్తున్నది. షర్మిలను అడ్డుపెట్టుకొని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.