నిరాహార దీక్ష భగ్నం, సొమ్మసిల్లి పడిపోయిన కిషన్ రెడ్డి

నిరాహార దీక్ష భగ్నం, సొమ్మసిల్లి పడిపోయిన కిషన్ రెడ్డి

లక్షలాది మంది నిరుద్యోగులకు సంఘీభావంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిష న్ రెడ్డి ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో బుధవారం చేపట్టిన దీక్షను పోలీసులు రాత్రి భగ్నం చేశారు. నిరహార దీక్ష చేసేందుకు అనుమతి పొందిన సమయం ముగిసినందున దీక్షను విరమించాలని గాంధీనగర్ ఏసిపి రవికుమార్, దోమలగూడ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు కోరారు. 

అయితే, దీక్ష చేసేందుకు 24 గంటల సమయం ఉందంటూ, గురువారం  ఉదయం వరకూ దీ క్షను కొనసాగిస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీక్ష చే సేందుకు సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే అనుమతి ఉందంటూ పోలీసులు ఎంత చెప్పినా రేపు ఉదయం వరకూ దీక్ష చేస్తానని కిషన్ రెడ్డి పట్టుబట్టారు. దీంతో రాత్రి 8 గంటలకు కిషన్ రెడ్డిని పోలీసు బలగాలతో బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించారు. 

పోలీసులు బీజేపీ ఉపవాస దీక్షను భగ్నం చేసే క్రమంలో కిషన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు కిషన్‌ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ కిషన్ రెడ్డి బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిరహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల తర్వాత అనుమతి గడువు పూర్తి కావడంతో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

పోలీసులు కిషన్‌రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకునే క్రమంలో.. బీజేపీ నేతలు పోలీసు వాహనానికి అడ్డంగా కూర్చుని నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తొక్కిసలాటలో కిషన్‌రెడ్డి కాలికి, చేతికి, ఛాతీభాగంలో, ఒంటిపై మరికొన్ని చోట్ల గోళ్లు గీరుకుపోయి గాయాలయ్యాయి. దాదాపు అరగంటపాటు జరిగిన ఘర్షణ అనంతరం.. పోలీసులు ఆయన్ను అక్కణ్నుంచీ బీజేపీ కార్యాలయానికి తరలించారు. అక్కడే కిషన్‌రెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు.

రాత్రి 9.30 గంటల సమయంలో వైద్యులు ఆయన్ను పరీక్షించి చికిత్స చేశారు. ఛాతీలో అయిన గాయానికి ఎక్స్‌రే తీయించుకోవాలని సూచించారు.  కాగా.. కిషన్‌ రెడ్డిని బలవంతంగా తరలించిన పోలీసుల తీరును బీజేపీ నేతలు తరుణ్‌ఛుగ్‌, డీకే అరుణ, ఎంపీ కె.లక్ష్మణ్‌ తదితరులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా  కిషన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి పరామర్శించారు. కేసీఆర్‌ సర్కారుపై పోరాటాన్ని కొనసాగించాలని, పార్టీ కేంద్ర నాయకత్వం మద్దతు ఉంటుందని చెప్పారు. 

మరోవైపు.. ప్రభుత్వ విధానాలకు, కిషన్‌రెడ్డి పట్ల పోలీసుల తీరును ఖండిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. నిరసనల్లో పార్టీ శ్రేణులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి పిలుపునిచ్చారు.