నిఫా వైర‌స్‌తోనే కోజికోడ్ మ‌ర‌ణాలు

కేర‌ళ‌లో నిఫా వైర‌స్ ప్ర‌బ‌ల‌డం క‌ల‌క‌లం రేపుతోంది. రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైర‌స్ కార‌ణంగానే ఇద్ద‌రు మ‌ర‌ణించార‌ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మ‌న్సుక్ మాండ‌వీయ మంగ‌ళ‌వారం నిర్ధారించారు. నిఫా వైర‌స్‌తో బాద‌ప‌డుతున్న న‌లుగురు అనుమానితుల ఆరోగ్య ప‌రిస్ధితిని గ‌మ‌నిస్తున్నామ‌ని, వారి శాంపిల్స్‌ను పరీక్ష‌ల‌కు పంపామ‌ని మంత్రి వెల్ల‌డించారు. 

నిఫా వైర‌స్ ప‌రిస్ధితి, వ్యాధి క‌ట్ట‌డిపై రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించేందుకు కేర‌ళ‌కు కేంద్ర బృందాన్ని పంపామ‌ని తెలిపారు. కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడాన‌ని, నిఫా వైర‌స్ కేసులు వ‌స్తున్నాయ‌ని తెలిసింద‌ని, గ‌బ్చిలాల ద్వారా ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని చెప్పారు. నిఫా క‌ట్ట‌డి కోసం ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టేలా మార్గద‌ర్శ‌కాల‌ను రూపొందించామ‌ని మంత్రి తెలిపారు. 

కాగా, కోజికోడ్‌ లో జ్వరం కారణంగా రెండు అసహజ మరణాలు  సంభవించాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మరణాలకు నిఫా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కారణమని ఆరోగ్య శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఈ ఇద్దరూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 

ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం నలుగురు రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. చనిపోయిన వారిలో ఒకరి బంధువు 22 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 4, 9 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు, 10 నెలల శిశువు కూడా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.