పీఓకే భారత్ లో కలిసిపోతుంది

కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ సహాయ మంత్రి రిటైర్డ్ జనరల్ వీకే సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే కొద్దికాలం తర్వాత దానంతట అదే భారత్ లో కలిసిపోతుందని వెల్లడించారు. ”కొద్దిరోజులు ఆగండి. పీఎంకే ఆటోమాటిక్‌గా ఇండియాతో విలీనమవుతుంది” అని దౌసలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భరోసా వ్యక్తం చేశారు. 
 
భారత్ కు రోడ్లు తెరవాలని పీఓకే షియా ముస్లింలు చేస్తు్న్న డిమాండ్‌పై మీడియా అడిగినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పిఒకెలోని షియా ముస్లింలు ఇటీవలికాలంలో తాము భారత్‌లోకి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. అక్కడి ప్రజల మనోగతం, వారి ప్రస్తుత డిమాండ్ల నేపథ్యంలో ఇక త్వరలోనే పిఒకె స్వతహసిద్ధంగానే భారతదేశంలో విలీనం అయ్యే విషయం స్పష్టం అవుతోందని ఇంతకు ముందు ఆర్మీచీఫ్‌గా అనుభవం ఉన్న వికె సింగ్ తెలిపారు.
కాగా, జి-20 సదస్సు విజయవంతం కావడంపై వీకే సింగ్ మాట్లాడుతూ, చాలా గొప్పగా ఈ సదస్సు విజయవంతం అయిందని సంతోషం వ్యక్తం చేశారు గతంలో ఎప్పుడూ నిర్వహించనంత గొప్పగా నిర్వహించారని చెప్పారు.  దేశంలోని సుమారు 60 నగరాల్లో 200 సమావేశాలు జరిగాయని చెప్పారు. ఇంతటి విజయవంతగా సదస్సును నిర్వహించడంపై ఇతర దేశాలు కూడా భారత్ ను శ్లాఘించాయని తెలిపారు. సమష్టిగా ఉమ్మడి ప్రకటనను విడుదల చేయడం పెద్ద విజయమని పేర్కొన్నారు. 
 
ఉక్రెయిన్ సహా అనేక అంశాలపై ప్రపంచ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అయితే మనం అందర్నీ కలుపుకొని వెళ్లి ఒక మార్గం కోసం ప్రయత్నించామని తెలిపారు. దీనికి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తు చేశారు. బయో ఫ్యూయల్ అలయెన్స్, ఇండియా నుంచి యూరప్ వరకూ కారిడార్ వంటివి భారత్ ఆర్థిక ప్రగతికి దోహదపడతాయని విశ్లేషించారు.