
జైళ్ల పాలనలో రాష్ట్రాలు మానవతా దృష్టితో ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కోరారు. రెండ్రోజుల పాటు జరిగే ‘జాతీయ స్థాయి మేథోమదనం’ విశాఖలోని రుషికొండ సాయిప్రియా రెస్టారెంట్‌లో సోమవారం ప్రారంభిస్తూ జైళ్ల పరిస్థితులను మెరుగుపరిచే టెక్నాలజీ విషయంలో పురోగతి సాధించాలని సూచించారు.
‘దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న అన్ని రకాల జైళ్లలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2047 సంవత్సరానికి వీటిని ఏ రకంగా పురోగతిలోకి తీసుకురావచ్చు? 75 ఏళ్ల స్వతంత్య్ర భారతదేశంలో జైళ్లలో ఖైదీల సంక్షేమం, సంస్కరణ’లపై ఈ సమావేశం జరిగింది.
నేరాలను నిరోధించేలా ఖైదీల్లో డి ఎడిక్షన్ కార్యకలాపాలను పెంచాలని, ముఖ్యంగా వారిలో మానసిక ఆరోగ్యం పెంచేందుకు తగిన కృషిని రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. 2023 న్యూ మోడల్ ప్రిజన్, సేవలు, అత్యధికంగా జైళ్లలోకి కుక్కబడుతున్న ఖైదీల విషయాలపై సమగ్రంగా రెండ్రోజుల పాటు చర్చించాలని చెప్పారు.
రాష్ట్రంలోని జైళ్లలో పేదలైన ఖైదీలకు వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత కార్పొరేట్ వైద్య సదుపాయం అమలు చేస్తున్నామని, మౌలిక వసతుల కల్పనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. శుద్ధమైన మంచినీరు, కరెంట్, పౌష్టికాహారం, రిక్రియేషన్ కల్పిస్తున్నట్లు వివరించారు.
ఖైదీలలో నైపుణ్యాలను వెలికితీసేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణను జైళ్లలో పెట్టామని, వారి ఉత్పత్తులను అమ్మేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. ఖైదీలకు చేయూత నిధిని, కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆమె చెప్పారు.
జైళ్లలో సెక్యూరిటీని పెంచామని, 12 అడిషనల్ సూపరింటెండెంట్ కేడర్ పోస్టులను (డిప్యూటీ, సూపరింటెండెంట్ మధ్య) ఏర్పాటు చేసుకునే అనుమతి ప్రభుత్వం ఇచ్చిందని హోమ్ మంత్రి తెలిపారు. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి 99 మంది, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ఐజి, డిఐజిలు, సూపరిండెంట్‌లు హాజరయ్యారు.
More Stories
జగన్ హయాంలో మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తుకై డిమాండ్
ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు
ఏపీలో శ్రీకాకుళంలో కొత్తగా ఎయిర్ పోర్ట్