అర్ధరాత్రి పవన్‍ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

 
ఏపీ సిఐడి అరెస్ట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కలిసేందుకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ ను అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు తొలుత  హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరబోగా, విమానం విజయవాడలో  దిగేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
 
దానితో, విజయవాడకు రోడ్డు మార్గంలో బయల్దేరిన పవన్ ను గరికపాడు చెక్ పోస్టు దగ్గర అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఓ రకంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  పవన్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకోవడంతో..  వాహనం దిగి పవన్ రోడ్డుపై నడుచుకుంటూ ముందుసాగారు. అయితే పవన్ ను మరోసారి పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు.
దీంతో కోదాడ వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనుమంచిపల్లిలో పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడంతో వాహనం దిగి నడక మొదలు పెట్టారు. 
పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. మంగళగిరి కార్యాలయానికి వెళ్లి తీరుతానని పవన్ స్పష్టం చేశారు. పవన్ ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనంలో అక్కడి నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి తరలించారు.  
 
పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు అనుమంచిపల్లి వద్ద పవన్ మీడియాతో మాట్లాడుతూ క్రిమినల్ కి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు.  చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తారని తామేమీ ముందుగా ఊహించలేదని, వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం తాము ఆదివారం ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నామని చెప్పారు.
“నన్ను ఆపితే పోలీసులకి ఒకటే చెప్పా.. బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బయట ఉన్నాడు. ఎంత సేపూ ఆ ముఖ్యమంత్రి జైలు గురించి ఆలోచిస్తాడు. అందర్నీ జైలుకి పంపాలనే ఆలోచిస్తాడు. అతనో క్రిమినల్. విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాలి” అంటూ మండిపడ్డారు. “ఆంధ్రప్రదేశ్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వీసా కావాలి అంటుందేమో?. కారణాలు చెప్పడం లేదు. రాకూడదు అంటున్నారు. రౌడీలు, గూండాలకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.