
చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిన సమయంలోనే ఇదే కేసులో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవిచంద్రలను కూడా విశాఖపట్టణంలో పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబుతో కలిసి ఏపీఎస్‌ఎస్‌డీసీని ఏర్పాటు చేసినట్లు గంటాపై ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా దీనిని ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఐడీ ఆరోపిస్తున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు జరపవచ్చని టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్న కోనసీమ జిల్లా రాజోలు నుంచి తండ్రిని చూసేందుకు బయల్దేరారు. అయితే ఈ క్రమంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు లోకేశ్. అసలు నన్ను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ పోలీసులను ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపి వేశారు. తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో డిపోలు, బస్టాండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆర్టీసీ బస్సులు తిరగకుండా నిలిపివేశారు.
పురందేశ్వరి ఖండన
చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని, అయినా ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు. ఆయనను సరైన నోటీసు లేకుండా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వివరణ తీసుకోకుండా, విధానాలను అనుసరించకుండా అరెస్ట్ చేయడాన్ని గట్టిగా ప్రశ్నించారు. ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని అంటూ ఆమె ధ్వజమెత్తారు.
అయితే, ఎలాంటి దురుద్దేశాలు లకుండా పాదర్శకంగా జరిగిన దర్యాప్తులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అంత పారదర్శకంగా జరిగిందని చెబుతూ ఇక వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేయలేరని, చంద్రబాబు అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని స్పష్టం చేశారు.
More Stories
డిల్లీ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దది
కృష్ణానదిపై తొమ్మిది వంతెనల నిర్మాణంకు సన్నాహాలు
షేర్ల బదిలీపై జగన్, భారతి ఆరోపణలు ఖండించిన విజయమ్మ