జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీ సిద్ధం

అగ్రరాజ్యాధినేతలు సహా 40కి పైగా దేశాల అధినేతలు, వివిధ ప్రపంచస్థాయి సంస్థల అధిపతులకు పాల్గొనే జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని న్యూఢిల్లీ నగరం సిద్ధంగా ఉంది. 1980వ దశకంలో ఇందిరాగాంధీ హయాంలో జరిగిన అలీన దేశాల సదస్సు తర్వాత మన దేశంలో జరుగుతున్న మొదటి అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు కావడంతో భారత ప్రభుత్వం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నది. 

గత ఏడాది డిసెంబర్ 1న జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతలు చేపట్టిన భారత్ అధ్యక్ష హోదాలో ప్రత్యేక ఆహ్వానితులుగా బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను ఆహ్వానించింది. జీ-20 సభ్యులుగా ఉన్న అమెరికా, చైనా, రష్యా, యూకే, జర్మనీ, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కొరియా తదితర 19 దేశాలు, యురోపియన్ యూనియన్‌తో పాటు ఈ 8 దేశాల అధినేతలు కూడా జీ-20 సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. 

జీ-20 సభ్యదేశాల్లో చైనా, రష్యా అధినేతలు మాత్రం ఈసారి సమావేశాలకు హాజరుకావడం లేదు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ స్థానంలో చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన బదులుగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రిని పంపుతున్నారు.

ప్రతియేటా జీ-20 సభ్యదేశాలు పాటు అంతర్జాతీయ సంస్థలు ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు (WB), ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ),  ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బి), ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓసీఈడి) సంస్థల అధినేతలు, ప్రతినిధులు పాల్గొంటారు. 

ఈ ఏడాది అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ మరికొన్ని అంతర్జాతీయ సంస్థలను జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించింది. వాటిలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ , ది కోలిషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉన్నాయి. అలాగే ఆఫ్రికన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ఆఫ్రికా అభివృద్ధి కోసం కొత్త భాగస్వామ్యం, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) వంటి ప్రాంతీయ సమాఖ్యలు లేదా సంస్థలను కూడా భారత్ ఆహ్వానించింది.

దీంతో న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు ఓ మినీ ప్రపంచాన్నే తలపిస్తుంది. ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న ఆర్థిక సంక్షోభాలు తలెత్తకుండా నివారించే ఆర్థిక నిబంధనలపై ఈ సదస్సు కసరత్తు చేయనుంది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, స్థిరమైన వృద్ధి సాధనే లక్ష్యంగా సదస్సులో నేతలు తీర్మానాలు చేయనున్నారు.

ప్రపంచాధినేతలంతా ఒక్క చోటే చేరుతూ ఉండడంతో వీవీఐపీ జోన్ సెంట్రల్ ఢిల్లీతో పాటు యావత్ నగరం భద్రతా వలయంలో వెళ్ళిపోయింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసింది. కేంద్ర పారామిలటరీ బలగాలతో సహా ఢిల్లీ పోలీసులు మొత్తం 1.4 లక్షల మంది ఈ భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. 

ఏ విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన కమెండో బలగాలు, ఫైరింజన్లు, ఫైర్ ఫైటర్లు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వంటి ప్రత్యేక యూనిట్లు, అంబులెన్లు, మొబైల్ వైద్య బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వారితో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు నిత్యం నగరాన్ని అణువణువూ గాలిస్తూ శతృమూకల దుశ్చర్యలను పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

సాయుధ బలగాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పోలీసులు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. నగరంలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ కెమేరాలకు తోడు అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం చేసిన సీసీటీవీ కెమేరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద కదలికలను పసిగట్టి వెంటనే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. 

అలాగే ఉగ్రవాదులు, వాంటెడ్ క్రిమినల్స్ ను కెమెరాలు స్కాన్ చేసి గుర్తుపట్టేలా ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ – ఏఐ టూల్స్ ను ఉపయోగిస్తున్నారు. వీటన్నింటితో పాటు సెంట్రల్ ఢిల్లీలో నివాసముండే స్థానిక ప్రజలకు మినహా మరెవరినీ మూడు రోజుల పాటు అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 

గురువారం నుంచే ఢిల్లీలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ – ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలకు సెలవులు ప్రకటించారు. ఆన్‌లైన్ డెలివరీలు తదితర సేవలను నిలిపేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే సెప్టెంబర్ 8, 9, 10, 11 తేదీల్లో ఢిల్లీకి చేరుకోవాల్సిన రైళ్లు, ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన రైళ్లు, ఢిల్లీ మీదుగా ప్రయాణించాల్సిన మొత్తం 207 రైలు సర్వీసులను రద్దు చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. దాదాపు 36 రైళ్లను దారిమళ్లించినట్టు వెల్లడించింది.

వివిధ దేశాధినేతల రాకపోకల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి దేశీయ విమాన సర్వీసులు పరిమితం అయ్యాయి. 160కి పైగా సర్వీసులను రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. మొత్తంగా భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ నగరం అంతటా పలు ఆంక్షలు, నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. 

న్యూఢిల్లీ (సెంట్రల్ ఢిల్లీ) ప్రాంతంలో అప్రకటిత లాక్‌డౌన్ వాతావరణం నెలకొంది. కర్తవ్యపథ్, ఇండియా గేట్ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై పూర్తిగా నిషేధం అమలవుతోంది. సెంట్రల్ సిటీలో బస్సులు, ట్యాక్సీ సర్వీసులపైనా ఆంక్షలు, నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలు వదిలి మెట్రో రైళ్లనే ఉపయోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.