ఢిల్లీ మద్యం పాలసీ కేసు దర్యాప్తు వేగవంతం

ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలు చార్జిషీట్లు దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో విచారణ వేగవంతం చేసి తుది చార్జిషీటు దాఖలు చేయాలని ఈడీ భావిస్తోంది. 

ఈ క్రమంలో కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు నోటీసులు పంపి విచారణకు పిలుస్తోంది.  కేసులో నిందితుల జాబితాలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవకు తాజాగా మరోసారి నోటీసులిచ్చినట్లు తెలిసింది. మంగళవారం న్యాయవాదితో పాటు మాగుంట శ్రీనివాసుల రెడ్డి విచారణకు హాజరైనట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. 

బుధవారం ఆడిటర్ బుచ్చిబాబును ప్రశ్నించినట్లు తెలిసింది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆయన ఆడిటర్‌గా వ్యవహరించారు. ఈ కేసులో దాఖలైన చార్జిషీట్లలో బుచ్చిబాబు వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. ఈ పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఆయన్ను విచారణకు పిలవడం చర్చనీయాంశంగా మారింది. 

లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో హైదరాబాద్‌, ఢిల్లీలో జరిగిన సమావేశాలు, ముడుపులు ఇవ్వడం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కేసులో నిందితుడు అమన్‌దీప్ ధల్ నుంచి ఈడీ అధికారి ఒకరు రూ. 5 కోట్లు ముడుపులు తీసుకున్న వ్యవహారం ఈ మధ్యనే వెలుగులోకొచ్చింది. దానిపై సీబీఐ కేసు కూడా నమోదు చేసి విచారణ చేపట్టింది. ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన అనంతరం ఈడీ ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేయడం గమనార్హం.